Feb 27,2022 11:24

చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువమంది వీటిని ఉడికించుకునో, కాల్చుకునో, కూరగా చేసుకునో తింటుంటారు. కానీ దీనితో కేక్‌, ఖజానా చిలగడదుంప, గులాబ్‌జామూన్‌, చిప్స్‌ కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి రుచి చూస్తే 'సో స్వీట్‌.. పొటాటో' అనాల్సిందే.


                                                                           చీజ్‌ కేక్‌

 చీజ్‌ కేక్‌

కావాల్సిన పదార్థాలు : స్వీట్‌ పొటాటో (చిలగడ దుంప) - ఒకటి (100 గ్రా.), కుకీ క్రంబ్స్‌ - కప్పు, తాజా పాల మీగడ (చిలికినది) - పావు లీటర్‌, క్రీమ్‌ చీజ్‌ - 200 గ్రా., గుడ్లు - మూడు, పంచదార పొడి - 200 గ్రా., మొక్కజొన్న పిండి - 125 గ్రా.
 

తయారుచేసే విధానం :
ముందుగా చిలగడ దుంపలను ఉడికించి గుజ్జు చేయాలి.
చిన్న చిన్న ముద్దలు తీసుకొని, గుండ్రంగా జామూన్లను తయారుచేయాలి. అందుకు కార్న్‌ఫ్లోర్‌ను వాడుకోవచ్చు.
వాటిని నూనెలో అన్ని వైపులా వేయించి, పంచదార పాకంలో వేసి ఉంచాలి.
వెడల్పాటి పుడింగ్‌ కేక్‌ గిన్నెకు అడుగున నెయ్యి రాయాలి. పైన కుకీ క్రంబ్స్‌ పొడి వేసి, ఆ పైన చిలగడదుంప జామూన్లు వేయాలి.
ఒక గిన్నెలో ఫ్రెష్‌ క్రీమ్‌ లేదా పాల మీగడ, పంచదార పొడి, మొక్కజొన్న పిండి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని పుడింగ్‌ గిన్నెలో పోయాలి.
ఆ గిన్నెను ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి సన్నని మంటమీద ఆవిరితో ఉడికించాలి. పూర్తిగా ఉడికాక దించుకోవాలి.
చల్లారాక తీసి, చాకొలెట్‌ చాప్స్‌తో అలంకరించి సర్వ్‌ చేయాలి.
ఓవెన్‌లో అయితే 160 నుంచి 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంటపాటు బేక్‌ చేయాలి.
తరిగిన డ్రై ఫ్రూట్స్‌, కొత్తిమీరతో అలంకరించాలి.

                                                                    గులాబ్‌ జామూన్‌

 గులాబ్‌ జామూన్‌

కావాల్సిన పదార్థాలు : చిలగడదుంపలు- మూడు (400 గ్రా.), కోవా - నిమ్మకాయ పరిమాణం లేదా రెండు స్పూన్లు, యాలకులు(పచ్చవి) - ఆరు లేదా ఎనిమిది, మైదా - రెండు స్పూన్లు, ఉప్పు - చిటికెడు, నూనె - వేయించడానికి తగినంత, పిస్తాపప్పు (తరిగినది) - స్పూన్‌.
పాకం కోసం : పంచదార - రెండు కప్పులు, నీళ్లు - రెండు కప్పులు.
 

తయారుచేసే విధానం :
చిలగడ దుంపలను శుభ్రం చేసి, ఉడికించి, పై తొక్క తీసి గుజ్జు చేయాలి. ఈ మిశ్రమం మూడు కప్పులు అవుతుంది.
మందపాటి గిన్నెలో పంచదార, నీళ్లు పోసి సన్నటి మంటమీద మరిగించాలి. పంచదార పాకం కొద్దిగా చిక్కబడేంతవరకు ఉంచాలి.
చిలగడదుంప ముద్దను చిటికెన వేలంత పొడవుగా, మందంగా ముక్కలుగా చేసుకోవాలి.
ఒక్కో చిలగడ దుంప ముక్కలో సమానంగా కోవా, యాలకుల పొడి, పిస్తాపప్పుతో స్టఫ్‌ చేసుకోవాలి.
తర్వాత దానిని రౌండ్‌గా చేతులతో రోల్‌ చేయాలి. ఇలాగే అన్నీ సిద్ధం చేసుకోవాలి.
మొత్తం 14 గులాబ్‌ జామూన్‌లు అవుతాయి. పాన్‌లో నూనె పోసి, కాగాక సిద్ధం చేసుకున్న జామూన్‌లను వేసి బాగా వేయించాలి.
ముదురు గోధుమరంగు వచ్చేంతవరకు వేయించిన గులాబ్‌జామూన్‌లను వేడి వేడి పంచదార పాకంలో వేయాలి. అందులో 20-30 నిమిషాల సేపు ఉంచి, సర్వ్‌ చేయాలి.
 

నోట్‌ : ఐదారు గంటల కన్నా ఎక్కువసేపు గులాబ్‌జామూన్‌లను పాకంలో ఉంచకూడదు. అలా ఉంచితే జామూన్‌లు గుజ్జుగా అయిపోతాయి. తయారుచేసేటప్పుడు జామూన్‌లను ఆరిపోయేంతవరకు ఉంచకుండా ఒక్కోజామూన్‌ తయారీకి 20 సెకన్లు మాత్రమే టైమ్‌ తీసుకోవాలి.


                                                                               చిప్స్‌..

 చిప్స్‌..

కావాల్సిన పదార్థాలు :
చిలగడదుంపలు- కిలో, నీరు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా, ఉప్పు- రెండు స్పూన్లు, మిరపపొడి- రెండు స్పూన్లు.
 

తయారుచేసే విధానం :
ముందుగా చిలగడ దుంపలను శుభ్రంగా నీటితో కడగాలి.
తర్వాత పైన తొక్కు తొలగించి, సన్నని గుండ్రని ముక్కలుగా తరుక్కోవాలి.
తరిగిన చిలగడ దుంప ముక్కలను అరగంట పాటు నీటిలో నానపెట్టాలి.
తరువాత బాగా కడిగి, మొత్తం నీటిని తీసివేయాలి.
పాన్‌లో నూనె వేడి చేసి చిలగడదుంపలను వేయించాలి. అంటే బంగాళాదుంప చిప్స్‌లాగా అన్నమాట.
తర్వాత వాటిమీద ఉప్పు, కారం పొడి చల్లి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయవచ్చు.
చిలగడదుంప చిప్స్‌ మంచి చిరుతిండిగా ఉపయోగపడతాయి. ఆరోగ్యానికీ చాలా మేలు చేస్తాయి.