ప్రజాశక్తి- ఆనందపురం : ఆనందపురం మండలం శొంఠ్యాంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ షేక్.షాహనజ్ సాధియా ఆధ్వర్యాన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. సుమారు 69 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలింతలు, మధుమేహం, రక్తపోటు ఉన్నవారికి పరీక్షలు జరిపారు. గర్భిణీ స్త్రీలకు ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. తదుపరి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఇంటి వద్ద చికిత్స పొందుతున్న రోగులు వద్దకు వెళ్లి వారు తీసుకుంటున్న చికిత్స, వాడుతున్న మందులు వివరాలడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అంగన్‌వాడీ, పాఠశాలలను సందర్శించి పిల్లల ఆరోగ్యంపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ లెంక లావణ్యరాంబాబు మాట్లాడుతూ, పల్లె ప్రజలకు వైద్యం చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. 14 రకాల పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సామాజిక ఆరోగ్య అధికారి పి.సాంబమూర్తి మాట్లాడుతూ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి గొంతుని సొమినాయుడు, ఆరోగ్య పర్యవేక్షకులు టి.కల్యాణమ్మ, పి.సన్యాసిరావు, సిహెచ్‌ఒ ఇందు, ఆరోగ్య కార్యకర్తలు గొర్లి సత్యవతి, జి.రమేష్, డిఇఒ జ్ఞానేశ్వరరావు, ఆశ కార్యకర్తలు అన్నపూర్ణ, బొద్ధపు శివశంకరి, ఉల్లి భారతి పైలెట్ తాతబాబు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










