* జెడ్‌పి చైర్‌పర్సన్ విజయ
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో వివిధ ప్రాంతాల్లో భూసేకరణ పెద్దఎత్తున చేపట్టి పట్టాలు అందజేసిందని, ఇళ్ల నిర్మాణంలో కూడా లబ్ధిదారులు ముందుకొచ్చి సొంతింటి కల నెరవేర్చు కుంటున్నారని, ఇటువంటి సమయంలో వారికి మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వ శాఖలు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ అన్నారు. జెడ్‌పి సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన 2, 4, 7, 1వ స్థాయీ సంఘ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పద్దులపై జరిగిన చర్చలో పీడీ నక్క గణపతిరావు మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక వసతులను సమకూర్చడంలో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నాట్టు వివరించారు. కాలనీల్లో నిర్మించిన ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లేదని సరుబుజ్జిలి జెడ్‌పిటిసి ప్రస్తావించారు. జగనన్న కాలనీల్లో విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల ఆ గృహాలకు ఎవరూ వెళ్లడం లేదని, అందువల్ల తక్షణమే ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఉపాధి పనులపై జరిగిన చర్చలో చెరువు, కాలువ పనులు చేపట్టాలని సభ్యులు ప్రస్తావించారు. పనులను గుర్తించి ఎంపిడిఒలకు సమర్చించాలని పీడీ జి.వి.చిట్టిరాజు వివరించారు. ఆర్‌అండ్‌బి ఎస్‌ఒ జాన్ సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న పనులను, టెండర్ల ప్రక్రియ, తదితర అంశాలపై సమాధానం ఇచ్చారు. టెక్కలి మండలం రావివలస వెళ్లే రహదారులు మరమ్మతులకు గురైందని, తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని జెడ్‌పిటిసి దువ్వాడ వాణి ప్రస్తావించారు. పొందూరు, సంతబొమ్మాళి మండలాల్లో రోడ్ల దుస్థితిపై సభ్యులు ప్రస్తావించారు. తక్షణమే వాటిని మరమ్మతులు చేపట్టాలని కోరారు. కవిటి మండలం మకరంపురం మీదుగా సోంపేట బస్సు నడపాలని కోరారు. జలందరపురం నుంచి జె.శాసనం వయా గోకర్షపురం రూట్‌లో బస్సు వేయాలన్నారు. 3వ స్థాయీ సంఘం పాలిన శ్రావణి అధ్యక్షతన జరిగింది. పశు సంవర్థకశాఖ పద్దులపై జరిగిన చర్చలో మృతి చెందిన పశువుల లబ్ధిదారులకు బీమా పథకం రావడం లేదని సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నాన్నారు. దీనిపై జెడి కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటికే రూ.11 కోట్లు విడుదలైనట్టు వివరించారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమవుతున్నట్టు చెప్పారు. మరో రూ.12 కోట్ల మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్టు తెలిపారు. 5వ స్థాయీ సంఘ సమావేశం జంపు కన్నతల్లి అధ్యక్షతన జరిగింది. వీరఘట్టం మండలం కత్తులకవిటిలో అంగన్వాడీ కేంద్రం-1 శిథిలావస్థలో ఉందని జెడ్‌పిటిసి ప్రస్తావించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జెడ్‌పి సిఇఒ వెంకటరామన్ పాల్గొన్నారు.










