ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఈ నెల 3న పిఠాపురం మున్సిపాలిటీలో 864 మందికి టిడ్కో ప్లాట్లను అప్పగిస్తామంటూ లబ్ధిదారులను పిలిచారు. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా రాగా నలుగురికి వేదికపై ఇంటి తాళాలను అప్పగిస్తూ గహాలను అందించారు. ఆర్భాటంగా కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు లబ్ధిదారులెవరికీ ఇళ్లను అప్పగించక పోగా కార్యక్రమానికి పిలిచి వెనక్కి పంపడంతో పలువురు తీవ్ర నిరాశ చెందారు. పాలకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేసారు. కాగా మౌలిక సదుపాయాలు పూర్తి కాకపోవడంతోనే ఇళ్లను అప్పగించలేదని అధికారులు చెప్పుకొచ్చారు. ఇలా కొన్ని చోట్ల ఒత్తిళ్ల నడుమ అప్పగించినా నిధుల కొరతతో సౌకర్యాలు కల్పించడం లేదు.
పట్టణ పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళను వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేకపోయింది. అదిగో ఇదిగో అంటూ ఇటీవల కాలంలో విడతల వారీగా 50 శాతం మందికి ప్లాట్లను అప్పగించినా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించలేకపోయింది. కొన్నిచోట్ల లబ్ధిదారులకు ఇచ్చినా సౌకర్యాలు లేక గహాల్లో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. ఉదాహరణకు సామర్లకోట పట్టణ పరిధిలో 420 మందికి ఇళ్ళు అప్పగించినా కేవలం ఒక్కరు మాత్రమే నివాసం ఉంటున్నారు అంటే పరిస్థితి అర్థం అవుతుంది.
ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి
ఉమ్మడి జిల్లాలో తొలి,మలి విడతల్లో రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతో పాటు అమలాపురం, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, మండపేట, రామచంద్రపురం మున్సిపాల్టీల్లో 23,398 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. మండపేటలో 6,128 ప్లాట్లకు 2,300, పెద్దాపురంలో 3312 ప్లాట్లకు 1728, సామర్లకోటలో 1054 ప్లాట్లకు 420, రామచంద్రపురంలో 2048 ప్లాట్లకు 1088, అమలాపురం 1632 ప్లాట్లకు 1632, రాజమహేంద్రవరంలో 6304 ప్లాట్లకు 4175, పిఠాపురంలో రెండు రోజుల క్రితం 864 ప్లాట్లకు 864 ప్లాట్లను ఇచ్చినట్లు అధికారులు చెబు తున్నారు. మొత్తంగా 12,189 మందికి ఇళ్ళు అప్పగించామని అధికారులు చెబుతున్నా 20 శాతం మంది కూడా ప్లాట్లలో నివాసం ఉండడం లేదు.
మౌలిక సదుపాయాలు ఏవీ.?
ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కల్లా మండపేటలోనే అత్యధికంగా టిడ్కో గహాలను నిర్మించారు. 40 శాతం మందికి ప్లాట్లను అప్పగించినా అంతగా సౌకర్యాలు సమకూర్చకపోవడంతో సుమారు 800 మంది మాత్రమే ఉంటున్నారు. కొన్ని ప్లాంట్లలో స్లాబు నుంచి వర్షం నీరు లీకు అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గహాల చుట్టూ తుప్పలు పేరుకుపోయాయి. తాగునీరు బయట నుంచి తెచ్చుకుంటున్నారు. మురుగు నీరు సక్రమంగా బయటకు పోయే మార్గాలు లేవు. పెద్దాపురంలో కూడా చుట్టూ తుప్పలు పేరుకుపోయి పాముల భయంతో లబ్ధిదారులు భయం భయంగా జీవిస్తున్నారు. తాగునీటిని సుదూర ప్రాంతం నుంచి తెచ్చుకుంటున్నారు. సామర్లకోటలో రూ.9 కోట్లతో వసతులు కల్పిస్తున్నారు. ఇక్కడ 90 శాతంపైనే పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ లబ్ధిదారులు ఎవరూ నివాసం ఉండటం లేదు. కేవలం ఒక్కరు మాత్రమే నివాసం ఉండడంతో పరిస్థితికి అద్దం పడుతుంది. నివాసయోగ్యంగా లేకపోవడంతో లబ్ధిదారులు ఎవరు ముందుకు రావడం లేదు అనేక సమస్యలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. పిఠాపురంలో రూ.10.33 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, వాటర్ లైన్, మురుగునీరు వ్యవస్థను ఇటీవల ఏర్పాటు చేసారు. కానీ ఎవరు నివాసం ఉండేందుకు ఇష్టపడడం లేదు.
కాకినాడలో ఎప్పటికి ఇచ్చేనో...
కాకినాడ సాంబమూర్తి నగర్‌లో తొలి విడతలో 36 బ్లాకుల్లో 1152 ఇళ్లు, రెండో విడతలో 29 బ్లాకుల్లో 928 ప్లాట్లు నిర్మించారు. తొలి విడతలో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయినా రెండో విడతలో ప్లాట్ల వద్ద కనీస సౌకర్యాలు పూర్తిగా కరువయ్యాయి. సుమారు ఐదేళ్ల క్రితం నిర్మించిన వీటిని నేటికీ ఒక్క లబ్ధిదారునికి కూడా పంపిణీ చేయలేదు. రెండో విడతలో నిర్మించిన ప్లాట్లు నిర్వహణ లేక పాడవుతున్నాయి. తుప్పలు పేరుకుపోయాయి. రోడ్లు కూడా ఇంకా నిర్మించలేదు. ఇవి ఎప్పటికీ పూర్తవుతాయో, ఎప్పుడు పంపిణీ చేస్తారో అధికారుల్లో సైతం స్పష్టత లేదు. కాకినాడ కార్పొరేషన్ లో లబ్ధిదారులకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు.










