Nov 12,2022 21:48

లక్ష్యానికి సూదరంగానే పేదింటి కల - అధ్వానంగా జగనన్న లేఅవుట్లు - సమీక్షలతోనే సరి
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌ 

                సామాన్యుడి కలల సౌధం కలగానే మిగిలిపోతుంది.. ఏళ్లు గడుస్తున్నా జగనన్న లేఅవుట్లలో నివాసాల నిర్మాణాలు చేపట్టడం లేదు. ఎన్నికల తరుణం కూడా దగ్గరపడుతోంది. దీంతో ఈ ఎన్నికలనాటికైనా సొంతింటి కల నేరవేరుతుందా? అని సామాన్యుడు ఆశతో ఎదురుచూస్తున్నాడు.
ఏలూరు జిల్లాలో 88,952 జగనన్న ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 758 లే అవుట్లలో 60,414, సొంతస్థలాల్లో నిర్మించుకునేందుకు మరో 28,538 మంజూరయ్యాయి. గృహ నిర్మాణశాఖాధికారుల లెక్కల ప్రకారం ఇందులో 11,143 ఇళ్లు పూర్తయ్యాయి. 54,803 బిలో బేస్‌మెంట్‌ లెవిల్‌లో, మరో 9,244 బేస్‌మెంట్‌ స్థాయిలో, 3,312 రూఫ్‌ స్థాయిలోను, 5640 స్లాబ్‌ లెవిల్‌లో ఉన్నట్లు చెబుతున్నాయి. 4,810 ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కానీ ఈ లెక్కలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నట్లు వాస్తవ పరిస్థితులు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ ఒక్క నివాసం కూడా మొదలుకాని లేఅవుట్లు జిల్లాలో అనేకం దర్శనమిస్తుండడం ఈ లెక్కల్లో డొల్లతనాన్ని బయటపెడుతోంది. వాస్తవానికి అధికశాతం మంది నివాసాలు మొదలుపెట్టకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కరోనా సమయం నుంచి ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండడం, నిర్మాణ సామగ్రితో పాటుగా కూలీల రేట్లకు రెక్కలు రావడం ప్రధానంగా కనిపిస్తోంది. ప్రభుత్వం తొలుత గృహ నిర్మాణదారులకు మూడు ఆప్షన్లను ఇచ్చింది. వినియోగదారుడు తనకు కావాల్సిన విధంగా నిర్మించుకుంటే దానికి తగిన విధంగా బిల్లులు మంజూరు చేయడం ఒకటికాగా, ప్రభుత్వం ఇచ్చిన మెటీరియల్‌తో ఇంటి నిర్మాణం చేపట్టకునేలా రెండో ఆప్షన్‌ ఉంది. ఇక మూడోది ప్రభుత్వమే ఇంటిని నిర్మించి అప్పగించేలా అంగీకార పత్రాలను కూడా తీసుకుంది. ఇందులో దాదాపుగా 80 శాతం మందికి పైగా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి తమకు అప్పగించేలా వినియోగదారులు అంగీకరించారు. దానికిగానూ వాలంటీర్లు చెప్పిన విధంగా బ్యాంకుల్లో ఖాతాలను కూడా తెరిచారు. కానీ ఇది జరిగి నెలలు గడుస్తున్నా దానికి సంబంధించిన పనులు ఒక్కటి కూడా ప్రారంభం కాలేదని చెప్పాలి. ఆ తర్వాత మూడో ఆప్షన్‌ను ప్రభుత్వం తొలగించింది. దీంతో చాలామంది లబ్ధిదారులు అసలు తమకు ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసిందనే విషయాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి నెలకొంది. దానికితోడు గృహాలకు సంబంధించి పదేపదే సమావేశాలను నిర్వహించడం కూడా లబ్ధిదారులకు విసుగును తెప్పిస్తోంది.
అధ్వానంగా లేఅవుట్లు..
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని చాలా లేఅవుట్లు బురదమయంగా మారాయి. కొన్ని లేఅవుట్లలో నీరు చేరి చెరువులను తలపించాయి. రోడ్లు కూడా బురదమయంగా మారాయి. చాలాచోట్ల లేఅవుట్లలో ఇంకా రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్‌ వంటి పనులు సాగుతున్నాయి. ఈ పనులను పూర్తి చేసిన తర్వాతే నివాసాల పనులను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దెందులూరు మండలంలో 3,523 మందికి జగనన్న ఇళ్లు మంజూరు కాగా 1,020 మాత్రమే పూర్తయ్యాయి. ఆర్థిక ఇబ్బందులతో 1100 ఇళ్లు, ఇసుక లేకపోవడంతో 1403 ఇళ్లు నిలిచిపోయాయి. మిగిలిన వారు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే సాహసం చేయడం లేదు. ఇళ్లు కట్టుకోలేని వారికి తామే ఇళ్లు కట్టించి పెడతామని ప్రభుత్వం ప్రచారంలో ఉదరగొట్టారు. తీరా ఇళ్లు ప్రారంభించాలని లబ్ధిదారుల నుంచి ఒత్తిడి రావడంతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా మీరే ఇళ్లు నిర్మించుకోవాలని ఇసుకను ప్రతి గ్రామంలో ర్యాంపులను ఏర్పాటు చేసి ఇసుక అందిస్తామన్నారు. దీంతో లబ్ధిదారులు ఇళ్లు ప్రారంభించారు. తర్వాత ఆన్‌లైన్‌లో రాజమండ్రి, చేబ్రోలు, సిద్ధాంతంలో మాత్రమే ఇసుక ఇస్తారని చెప్పడంతో రవాణా ఛార్జీలు వెచ్చించి ఇసుక తెచ్చుకున్నారు. అయితే సరిపడునంత ఇసుక లేకపోవడంతో ఇళ్లు ఏ విధంగా కట్టుకోవాలో తెలియక తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ప్రభుత్వం విడతల వారీగా రూ.లక్షా 80 వేలు ఇస్తున్నా మరో రూ.ఎనిమిది లక్షలు లేనిదే ఇల్లు పూర్తి గాని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.