
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని అమరావతిలోని ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు గత నెల 3వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం మరింత అయోమయంలో చిక్కుకుంది. హైకోర్టు నిర్ఱయంపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణకు నవంబరుకు వాయిదా వేసింది. ఈ నిర్ణయంతో ఇళ్ల నిర్మాణం ఇప్పట్లో జరిగే అవకాశం కన్పించడం లేదు. ఒక వైపు సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో జనవరి తరువాత అనుమతి వచ్చినా ఎన్నికల కోడ్ వచ్చి ఇళ్ల నిర్మాణం పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆర్-5 జోన్‌లో ఇళ్లు నిర్మించి లబ్ధిదారుల కుటుంబాలను మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలో ఓటర్లుగా చేర్పించి తద్వారా ఈ రెండు నియోజకవర్గాలను గెలవాలన్న వైసిపి ఎత్తుగడ ఫలించే అవకాశం లేదు. దీంతో ఒక వైపు వైసిపి నేతలు డీలాపడ్డారు. తమకు రాజధానిలో ఇల్లు వస్తుందనుకున్న నమ్మకం పోయిందనిలబ్ధిదారులు వాపోతున్నారు.
రాజధాని అమరావతి పరిధిలో గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి జులై 24న సిఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో గత కొంతకాలంగా విచారణ జరుగుతున్నా ప్రభుత్వం హడావుడిగా గత నెల 24న శంకుస్థాపనకు చేసింది. సిఎం శంకుస్థాపన చేసిన 10 రోజుల్లోనే హైకోర్టు నుంచి నిర్మాణాలను నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు 50 వేల ఇళ్లకు నిర్మించిన 25 లేఅవుట్ల కోసం ప్రభుత్వం రూ.180కోట్లతో హడావుడి పనులు ప్రారంభించింది. దాదాపు రూ.88 కోట్లమేరకు పనులు పూర్తి అయ్యాయి. గతనెల 3న హైకోర్టు స్టేతో ఈ పనులన్నీ అధికారులు నిలిపివేశారు. ఇప్పుడు పరిస్థితి మొత్తం తలకిందులు కావడంతో ఈ నిధులతో చేపట్టినపనులన్నీ వృధాయేనని అధికారులు కూడా నొచ్చుకుంటున్నారు. హైకోర్టు తుది తీర్పు వెలువడక ముందే తాము పేదల కోసం న్యాయపోరాటం చేసి విజయం సాధించామని సిఎంజగన్, మంత్రులు జులై 24న వెంకటపాలెంలో జరిగిన సభలో పేర్కొనడం కూడా తీవ్ర వివాదస్పదంగా మారింది. సిఎం, మంత్రుల ప్రకటనలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి ఈ నేపధ్యంలో హైకోర్టు స్టేఉత్తర్వులు ప్రభుత్వ పెద్దలకు మింగుడు పడని పరిస్థితిని కల్పించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అదే రోజు ప్రకటించారు.
తాజాగా శుక్రవారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో ప్రభుత్వ వర్గాలు మరింత ఇరకాటంలో పడ్డాయి. అమరావతిపై పట్టు సాధించేందుకు సిఎం జగన్ ఇళ్ల స్థలాల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్‌టిఆర్,గుంటూరు జిల్లాల వారికి ఇళ్ల స్థలాలను ఈఏడాది మే 26న సిఎం జగన్ పంపిణీ చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పట్టాల పంపిణికి ముందే పట్టాకాగితాలపై కోర్టు తుది తీర్పునకులోబడి హక్కులు ఉంటాయని ముద్రించారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం కూడా నిధులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అయినా తొలుత రాష్ట్ర ప్రభుత్వనిధులతోనే ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు జులై 24న సిఎంజగన్ మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో శంకుస్థాపన చేశారు. కోర్టు నుంచి ప్రభుత్వానికే సానుకూల నిర్ణయం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ పరిస్థితి తారుమారై పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చివరికి సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వానికి అనుకూల నిర్ణయం రాకపోవడంతో ప్రభుత్వానికి ఇరకాటమైన పరిస్థితి ఏర్పడింది. తమకు మూడేళ్లుగా రాజధానిలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆశపెట్టి ఇప్పుడు ఎటూ కాకుండా చేశారని పలువురు 50 వేల మంది లబ్ధిదారులు తీవ్రనిరాశకు గురయ్యారు. కొన్నేళ్లుగా ప్రభుత్వంపై పోరాడుతున్న రాజధాని రైతులకు సుప్రీం నిర్ణయంతో మరింత ఊరట లభించినట్టు అయింది.