ప్రజాశక్తి -అనకాపల్లి
జీవీఎంసీ విలీన గ్రామం కొత్తూరు నరసింహరావు పేట గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 75/3లో ఎకరా 75 సెంట్లు స్థలాన్ని వైసిపి కార్యాలయానికి మంజూరు చేస్తూ విడుదల చేసిన జీవోపై ఆ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. కొత్తూరు నర్సింగరావుపేట సచివాలయం వద్ద గురువారం ఆందోళన చేపట్టి సచివాలయ సూపరింటెండెంట్ షేక్ ఇస్మాయిల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి నాయకులు మాట్లాడుతూ తమకు తెలియకుండానే తమ పార్టీ నేతలు తమ గ్రామంలోని స్థలాన్ని ఎలా పార్టీ కార్యాలయానికి కేటాయిస్తారని ప్రశ్నించారు. గ్రామ సామాజిక అవసరాలైన కళ్యాణ మండపం, పాఠశాల, వ్యాయామశాల, గ్రంథాలయం నిమిత్తం ఆ స్థలాన్ని ఉంచుకోగా, ఒక రాజకీయ పార్టీకి కేటాయించడం తగదన్నారు. పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం కష్టించి పనిచేస్తున్న తమను నిర్లక్ష్యం చేసి తమకు తెలియకుండా ఇటువంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే ఆ ఉత్తర్వులను నిలుపుదల చేసి కార్యకర్తల మనోభావాలకు విలువనిచ్చి ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు జరగకుండా, అనుమతులు మంజూరు చేయకుండా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విలీన గ్రామాల వైసిపి ఇన్‌ఛార్జులు గొల్లవిల్లి నరసింగరావు, చేబ్రోలు సత్య, కరణం సురేష్, గొల్లవిల్లి రమణ, పన్నీరు మహేష్, అరిగా అప్పారావు, చేబ్రోలు దుర్గ ప్రసాద్, గొల్లవిల్లి జానకిరామ్, బల్లిన నాగు, మాజీ సర్పంచ్ కసిరెడ్డి సత్యనారాయణ, కోనేటి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.










