May 19,2023 16:44
  • విధులు బహిష్కరించి ఆస్పత్రుల ముందు బైఠాయించిన శానిటేషన్ కార్మికులు 
  • సమ్మెలో పాల్గొన్న చింతపల్లి, ముంచంగి ఫుట్, అరకు, పాడేరు, ఆస్పత్రుల కార్మికులు
  • రోగులతో కిటకిటలాడే పాడేరు జిల్లా ఆస్పత్రి లో స్తంభించిన పారిశుధ్య పనులు

ప్రజాశక్తి-పాడేరు : తమ వేతన సమస్యల  పరిష్కారం కోసం అల్లూరి జిల్లా పాడేరు డివిజన్లోని ప్రభుత్వ ఆస్పత్రుల శానిటేషన్ కార్మికులు శుక్రవారం తమ విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. చింతపల్లి పాడేరు ముంచంగిపుట్టు అరకు ఆస్పత్రులలోని శానిటేషన్ కార్మికులు సుమారు 56 మంది శుక్రవారం సమ్మెలో భాగంగా తమ విధులను బహిష్కరించి ఆసుపత్రుల ముందు బైఠాయించారు. పాడేరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి లో పనిచేస్తున్న 22 మంది శానిటేషన్ కార్మికులు సమ్మెకు ఉపక్రమించి ఆసుపత్రి ముందు బైఠాయింపు జరిపారు. దీంతో పాడేరు జిల్లా ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు స్తంభించాయి దీర్ఘకాలంగా ఉన్న తమ వేతన సమస్యల పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని నినదించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు ఎల్ సుందర్ రావు మాట్లాడుతూ ఆస్పత్రుల శానిటేషన్ కార్మికుల వేతన సమస్యల పరిష్కారం పై వైద్య విధాన పరిషత్ అధికారులు శ్రద్ధ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అనేకసార్లు కార్మికుల వేతన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని చెప్పారు. జీవో ప్రకారం ప్రతి కార్మికుడికి నెలకు 16 వేల(కనీస వేతనం 26 వేలు)రూపాయలు వేతనం చెల్లించాలని కానీ కొన్ని ఆసుపత్రుల్లో కార్మికులకు 10,700 మరికొన్ని ఆసుపత్రుల్లో 9,500 చొప్పున చెల్లిస్తున్నారని తెలిపారు. పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపించారు. నేటి నుంచి కార్మికులు చేపడుతున్న సమ్మెతోనైనా అధికారులు స్పందించి వారి వేతన సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ముఖ్యంగా కార్మికులకు కాంట్రాక్టు విధానం రద్దు చేయాలని, వైద్య విధాన పరిషత్ ద్వారా జీతాలు చెల్లించాలని,ప్రతి ఆస్పత్రిలో సరిపడా సిబ్బందిని నియమించి కార్మికులపై పని భారం పని ఒత్తిడి తొలగించాలని డిమాండ్ చేశారు.2019 నుంచి కార్మికుల జీతాలు పెంచలేదని, గత నాలుగేళ్లలో అన్ని నిత్యవసర ధరలు రెట్టింపు అయ్యాయని దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి కార్మికుడికి నెలకు 16000  జీతం చెల్లించాలని, ప్రతినెల సక్రమంగా వేతనాలు చెల్లించాలని కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పేసియల్ యాప్ రద్దు చేయాలని,యూనిఫామ్ సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పారిశుద్ధ్య సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.ముత్యాలమ్మ, సుధారాణి, ఘటి, పుణ్యవతి, రాజేశ్వరి, సింహాచలం, నాగేశ్వరరవు, శివ, లక్షమాన్, కార్మికులు పాల్గొన్నారు.