
ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్రంలో వ్యవసాయ జిల్లాగా పేరున్న గుంటూరు జిల్లాలో పదేళ్ల కాలంలో పంటల సాధారణ విస్తీర్ణం, సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాలు అనుసరిస్తున విధానాలు, వ్యవసాయ సంక్షోభంతో రైతులు సాగుకు దూరమవుతున్నారు. కాగా వాణిజ్య పంటలతో పోలిస్తే ప్రధానమైన ఆహార పంట వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో ఖరీఫ్ ప్రధాన సీజన్. ఈ సీజన్‌లోనే అత్యధిక విస్తీర్ణం సాగవుతుంది. 2014 రాష్ట్ర విభజన నాటి నుండి 2021 వరకూ, జిల్లాల విభజన జరిగిన 2022 సంవత్సరం, ప్రస్తుత సంవత్సరంలో ఖరీఫ్ సాగు తీరును పరిశీలిస్తే ఏటికేడు సాధారణ విస్తీర్ణం, సాగువుతున్న విస్తీర్ణం తగ్గడం స్పష్టమవుతోంది. మధ్యలో రెండు మూడేళ్లు సాగు భూమి పెరిగినట్లు కనిపించినా మొత్తంగా తగ్గుదల ఉంది.
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగటం కూడా సాధారణ విస్తీర్ణం తగ్గటానికి కొంత కారణంగా ఉంది. రాజధాని పేరుతో సారవంతమైన భూములు తీసుకోవటం, మంగళగిరి, పొన్నూరు, మంగళగిరి, నర్సరావుపేట, గుంటూరు తదితర పట్టణాల చుట్టుపక్కల ఈ కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సాగు భూములు వినియోగించటం సాగు విస్తీర్ణం తగ్గుదలకు కారణమని అధికారవర్గాల అంచనా.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2014 నాటికి సాధారణ విస్తీర్ణం 14.51 లక్షల ఎకరాలుంటే జిల్లాల విభజన జరగక ముందు వరకూ (2021) పరిశీలిస్తే దాదాపు 1.50 లక్షల ఎకరాలు తగ్గి 13.07 లక్షలకు దిగజారింది. జిల్లాల విభజన అనంతరం కూడా సాధారణ విస్తీర్ణం తగ్గుదల కనిపిస్తోంది. సాగైన విస్తీర్ణం కూడా 2014లో 14.02 లక్షలు ఉంటే 2021లో అది 12.66 లక్షలకు పడిపోయింది. మధ్య మధ్యలో 2017, 2018 సంవత్సరాల్లో సాగు విస్తీర్ణం కొంత మెరుగ్గా ఉన్నట్లు కనిపించినా ఆయా సంవత్సరాల్లో కరువు ప్రభావం వల్ల ఖరీఫ్ సాగు ఆలస్యమై, రబీ పంటలు కలిపి వేయటం వల్ల పెరిగింది.
కౌలు రైతులకు దక్కని సాయం
జిల్లాలో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సుమారు 70 శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. అయితే వారికి తగిన పెట్టుబడిని ప్రభుత్వాలు అందించడం లేదు. బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇప్పించటంలో విఫలం అవుతున్నాయి. జిల్లాలో 2 లక్షలకుపైగా కౌలు రైతులుంటే అందులో కనీసం సగం మందికి కూడా గుర్తింపు కార్డులు, రుణాలు దక్కట్లేదు. ప్రభుత్వాల నుండి పరిహారం, సబ్సిడీలు ఇతర సదుపాయాలకు నోచుకోవట్లేదు.దీనికి తోడు జిల్లాలో మిర్చిలో, పత్తి పంటలో తెగుళ్లు, నకిలీలతో దిగుబడి తగ్గిపోయి, రైతులు ఆప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి ఏటా 50 నుండి 60 మంది కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
గతేడాది మిర్చిలో తెగులు వచ్చి జిల్లా మొత్తం పూర్తిగా పంట నష్టం వచ్చింది. ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి సాయం అందలేదు. అంతకు ముందు రెండు, మూడేళ్లపాటు పత్తిలో గులాబీ పురుగు ప్రభావంతో దిగుబడులు తగ్గాయి. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి ప్రధాన పంటలు. అయితే వాణిజ్య పంటలైన పత్తి, మిర్చితో పోలిస్తే ఆహార పంట అయిన వరి విస్తీర్ణం తగ్గుతుంది. నాగార్జున సాగర్ కుడికాలువ, కృష్ణా పశ్చిమ డెల్టాకు సకాలంలో నీరు విడుదల చేయకపోవటంతో వరి విస్తీర్ణం తగ్గుతోంది. ఒకప్పుడు కాల్వ నీటిపై ఆధారపడి వరి పంట వేసే వారు. ఇప్పుడు నీరు ఎప్పుడు వస్తుందో తెలియక డెల్టా ప్రాంతంలో వెద పద్దతికి మరలిపోయారు. 2014లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం 5,99,630 ఎకరాలుంటే జిల్లాల విభజ నాటికి (2021లో) 4,98, 952 ఎకరాలకు పడిపోయింది. ఇక మిర్చి, పత్తి పంటలు ముందటి ఏడాది వచ్చిన అనుభవాలతో రైతులు ప్రతిఏటా పంటలను మారుస్తున్నారు.
(గత పది సంవత్సరాల కాలంలో జిల్లాలో సాధారణ విస్తీర్ణం, సాగు విస్తీర్ణం వివరాలు ఎకరాల్లో..
2022, 2023 సంవత్సరాల్లో విభజన అనంతరం గుంటూరు జిల్లాలో వివరాలు)
సంవత్సరం సాధారణ విస్తీర్ణం సాగు విస్తీర్ణం
2014 14,51,407 14,02,185
2015 14,44,567 12,45,520
2016 13,93,570 12,23,990
2017 13,38,035 13,49,010
2018 13,60,987 14,11,430
2019 13,35,867 13,87,072
2020 13,24,057 13,00,440
2021 13,07,312 12,66,995
2022 3,48,295 3,00,237
2023 3,38,752 2,32,132