ప్రజాశక్తి - ఏలూరు
జగనన్న ఇళ్లు కార్యక్రమం కింద జిల్లాలో అందిన దరఖాస్తులన్నింటినీ శనివారంలోగా ఆన్‌లైన్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశపు మందిరంలో జగనన్న ఇళ్లు, నాడు-నేడు, పారిశుధ్యం, రీసర్వే, మధ్యాహ్న భోజనం, ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం తదితర అంశాలపై జిల్లాస్థాయి అధికారులతో కలిసి బుధవారం మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న ఇళ్ల పథకం, 90 రోజుల్లో ఇళ్ల స్థలాల మంజూరు కింద అందిన దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ శనివారంలోగా నూరుశాతం ఆన్‌లైన్ చేయాలన్నారు. వివరాలను గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు పంపాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 1.14 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, 23 వేల మంది లబ్ధిదారులకు కోర్టు కేసులు, లబ్ధిదారుల మరణం, వలస వెళ్లడం, స్థలాలపై లబ్ధిదారుల అనాసక్తి, సమస్యాత్మక లేఅవుట్‌లు తదితర కారణాలతో ఇళ్ల స్థలాలు మంజూరు ఆగిందన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు, సమస్యాత్మక లేఅవుట్‌లు తదితర అంశాల్లో సదరు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలు అందుబాటులో ఉంటే ప్రతిపాదనలు వెంటనే పంపాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటి సరఫరా లేని కారణంగా నిర్మాణాల్లో ప్రగతి లేదని గతంలో అధికారులు తెలియజేసారని, అటువంటి సమస్య ఉన్నచోట్ల నీటి సౌకర్యం కల్పించామని చెప్పారు. పారిశుధ్యంపై సమీక్షిస్తూ జిల్లాలోని ప్రతి మండలంలో వారానికి ఒక గ్రామంలో స్పెషల్ డ్రైవ్ మోడ్ లో సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమం అమలు చేసేలా ఎంపిడిఒలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా చెత్త లేకుండా చూడాలన్నారు. గ్రామాలు, పురపాలక సంఘాల్లో తడి చెత్త నుండి నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారీ, అమ్మకంపై ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం ద్వారా స్థానిక సంస్థలకు ఆదాయం లభిస్తుందన్నారు. దీనికోసం వ్యవసాయ శాఖలో రిటైర్డ్ అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమిస్తామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం సరఫరా, తదితర అంశాలను పరిశీలించాలన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో పనులు చేపడుతున్న పాఠశాలల్లో సిమెంట్ వంటి నిర్మాణ సామాగ్రిని తరగతి గదుల్లో నిల్వ చేయవద్దన్నారు. రీసర్వే చేపట్టిన కేటగిరి-3 గ్రామాల్లో కచ్చితమైన సర్వే పనులు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి.అరుణ్‌బాబు, డిఆర్‌ఒ ఎవి.సత్యనారాయణమూర్తి, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, డిఇఒ ఆర్‌ఎస్.గంగాభవాని, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, వ్యవసాయశాఖ జెడి వై.రామకృష్ణ, పంచాయతీరాజ్ ఎస్‌ఇ చంద్రభాస్కరరెడ్డి, డ్వామా పీడీ రాంబాబు, డిపిఒ ఎన్.బాలాజీ, జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ ఝాన్సీరాణి, డిఎంహెచ్‌ఒ డాక్టర్ రవి, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ ఎవిఆర్.మోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










