ప్రజాశక్తి-పంగులూరు: రైతులు పండించిన శనగలను కొనుగోలు చేసేందుకు, ప్రభుత్వం శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తల్లపనేని రామారావు కోరారు. మంగళవారం పంగులూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో రైతులు శనగ పంటను సాగు చేశారని అన్నారు. పంగులూరు, అద్దంకి, కోరిసపాడు, యద్దనపూడి, ఇంకొల్లు, పర్చూరు, చిన్నగంజాం, కారంచేడు మండలాల్లో అధికంగా సాగు చేశారన్నారు. ఈ మండలాల్లో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రామారావు కోరారు. రైతులు గత నాలుగేళ్లుగా సరైన ధర రాక, శనగలను కోల్డ్ స్టోరేజీలో పెట్టుకొని నష్టపోతున్నారన్నారు. ఈ సంవత్సరం కూడా సరైన ధర లేకపోతే శనగలు మొత్తం కోల్డ్ స్టోరేజీలకు తరలిపోయే అవకాశం ఉందని అన్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల ఈపాటికి శనగ రైతులు కొంత నష్టపోయారని ఆయన చెప్పారు. ప్రభుత్వం శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే, ప్రైవేట్ వ్యాపారులు పూర్తిగా ధరలు తగ్గించి రైతులను నిలువునా ముంచే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన మార్కెట్ ధర క్వింటాలు రూ.5,335 రూపాయలుండగా, బయట మార్కెట్లో 4,400 రూపాయలు మాత్రమే ఉందని చెప్పారు. ఈ రేటు ప్రకారం రైతులు శనగలను అమ్ముకుంటే, క్వింటాకు 800 రూపాయలు నష్టపోవాల్సివస్తుందని చెప్పారు. ఎకరాకు కౌలుతో కలుపుకొని సుమారు 35 వేల రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెట్టారని, ఎకరాకు 7, 8 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోందని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యాపారులకు సరుకు అమ్ముకుంటే ఎకరాకు 6 నుంచి 7 వేల రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తోందని చెప్పారు. కనుక ప్రైవేట్ వ్యాపారం నుంచి శనగ రైతులను కాపాడాలంటే, శనగ పండించిన ప్రతి మండల కేంద్రంలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని రామారావు డిమాండ్ చేశారు. శనగలు పండి రైతుల చేతికి వచ్చేసరికి శనగల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే రైతులు వెంటనే అమ్ముకుంటారని, లేకపోతే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు. శనగల కొనుగోలు కేంద్రంలో అమ్ముకుంటే రైతుల డబ్బులు కూడా గ్యారెంటీ ఉంటుందని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.










