Mar 07,2023 01:00

ప్రజాశక్తి-పంగులూరు: శనగ పంట దిగుబడి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది. సంవత్సరం రెండు నెలల క్రితం కురిసిన అధిక వర్షాలకు, శెనగ పంట మొత్తం పూర్తిగా పోయిందని భావించిన రైతాంగానికి, ఈ సంవత్సరం దిగుబడులు ధైర్యాన్నిచ్చాయి. గత నాలుగు సంవత్సరాలుగా శనగ దిగుబడులు సక్రమంగా లేకపోవడంతో వచ్చిన పంటను సకాలంలో సరైన ధరలు లేకపోవడంతో రైతులు పంట మొత్తాన్ని కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టారు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగటం, కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉన్న సరుకుకు అద్దె పెరగటం వలన, రైతాంగం ఈ సంవత్సరం శనగ పంటపై అంతగా ఆసక్తి చూపించలేదు. అసలు ఒక దశలో శనగ సాగు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో కూడా పడిపోయారు. గత సంవత్సరం మండలంలో 5,500 ఎకరాలలో సాగు చేసిన రైతాంగం, ఈ సంవత్సరం 4,100 ఎకరాల్లో శనగలు సాగు చేశారు. మండలంలో ఈ సంవత్సరం సుమారు 1,400 ఎకరాల్లో శనగ సాగు తగ్గింది. అధిక వర్షాలకు శనగ పూర్తిగా పోయింది అనుకున్న రైతాంగం డీలాపడిపోయారు. అయితే అధిక వర్షాలకు శెనగ పైరు తట్టుకొని నిలబడింది. ఆ పంటపై ఆశలు చావని రైతాంగం, మంచి మందులు వాడి జాగ్రత్తగా పంటను కాపాడుకున్నారు. దీంతో, ఇప్పుడు శనగ మంచి దిగుబడులను ఇస్తోంది. జె జె - 11 రకం శనగలు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గతంలో ఏడెమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చిందంటేనే రైతులు చాలా గొప్పగా చెప్పుకునే వారు. ఇప్పుడు 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావటంతో, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.5,335 ప్రకటించగా ప్రైవేట్‌ వ్యాపారులు మాత్రం రూ.4,600 రూపాయలకు మాత్రమే అడుగుతున్నారని కొందరు రైతులు తెలిపారు. తాము ప్రభుత్వం ప్రకటించిన రేటుకి అమ్ముకోవాలని చూస్తున్నామని కొందరు రైతులు తెలిపారు. ఈ సంవత్సరం శనగ పెట్టుబడి ఎకరాకు 15 వేల రూపాయల వరకు అయ్యింది. అందువలన సొంత భూమి గల రైతులకు, ఈ సంవత్సరం శనగ పంట లాభదాయకంగానే ఉంది. కౌలు రైతులకు మాత్రం 10 క్వింటాళ్ల దిగుబడి దాటితేనే లాభం వస్తుందని కొంతమంది కౌలు రైతులు తెలిపారు. కౌలు ఈ సంవత్సరం పంగులూరు ప్రాంతంలో శనగ పంట వేసే పొలాలు ఎకరం 12 నుంచి 14 వేల వరకు ధర ఉంది. అందువలన కౌలు రైతులకు 10 క్వింటాళ్లు దాటితేనే లాభం వస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సంవత్సరం శనగ పంట లాభదాయకంగానే ఉందని, మంచి దిగుబడులు వచ్చాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మిషన్‌ వేసి శనగ నూర్చుతున్న దృశ్యం