ప్రజాశక్తి - జీలుగుమిల్లి
రోడ్ ప్రమాదంలో రెండు కాళ్లు, ఒక చెయ్యి పూర్తిగా కోల్పోయి, ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇంటికి చేరుకున్న మిత్రుడు గుడెల్లి జగదీష్‌ను శనివారం అంబేద్కర్ యూత్ సభ్యులు పరామర్శించి ఆర్థికంగా సహకరించారు. జీలుగుమిల్లి గ్రామానికి చెందిన గుడెల్లి జగదీష్ నెల రోజుల క్రితం జాతీయ రహదారిపై రోడ్ ప్రమాదానికి గురై, మంగళగిరి ఆసుపత్రిలో చికిత్స పొందారు. తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటం గమనించి శనివారం తోటి అంబేద్కర్ యూత్ సభ్యులు, జగదాంబ ట్రాలీ ఆటో యూనియన్ వారి సహాయంతో మొత్తం రూ.45వేలను తమ వంతు ఆర్థిక సహాయంగా అందజేసినట్లు యూత్ అధ్యక్షులు తలారి సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తమంతా కలిసి తమ వంతు సహాయం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్, నాగేంద్ర, మనోజ్, జనార్థన్ పాల్గొన్నారు.










