May 14,2023 23:59

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాలో వడగాల్పులు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం నుంచి ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో పగటి పూట బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. ఆదివారం పల్నాడు జిల్లాలో గరిష్టంగా 47.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లాలోని దాదాపు 22 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచాయి. ప్రజలు వేసవి తాపంతో అల్లాడుతున్నారు.
తుపాను ప్రభావం తగ్గిన తరువాత రెండు జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. పల్నాడు జిల్లాలో మాత్రం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణీ కార్తెకు ముందే వడగాల్పులు, 47.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో రాబోయే పక్షం రోజుల్లో వీటి ప్రభావం మరింత పెరగవచ్చునని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఆదివారం నమోదు అయిన ఉష్ణోగ్రతల వివరాలిలా ఉన్నాయి. గురజాల, దుర్గి 47.5, దాచేపల్లి 47.2, అమరావతి 47, అచ్చంపేట 46, ఈపూరు 45.6, బెల్లంకొండ 44, పిడుగురాళ్ల 42, వెల్దుర్తి 42.4, రాజుపాలెం 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరులో 41.4, తెనాలిలో 41.7, కొల్లిపర 41, తాడికొండ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
వడగాల్పులతో ఉక్కపోత పెరిగింది. పగటి పూట జనసంచారం తగ్గింది. మధ్యాహ్న సమయంలో వీధులన్నీ బోసిపోతున్నాయి. వేసవి తీవ్రతతో మళ్లీ విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో అదనపు లోడ్‌ రిలీఫ్‌ పేరుతో గంట నుంచి రెండు గంటల పాటు అనధికారికకోత అమలు అవుతోంది. కొన్నిచోట్ల మరమ్మతుల పేరుతో నిలిపివేస్తున్నారు. వేడిగాలలు తీవ్రతకు పిల్లలు, వృద్దులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ఏసీలు, కూలర్లు వినియోగించేవారు ఉదయం నుంచి నిరాటకంగా వినియోగించడం వల్ల విద్యుత్‌కు బాగా డిమాండ్‌ ఏర్పడింది. సగటున జిల్లాలో 20 శాతం విద్యుత్‌ వినియోగం పెరిగినట్టు జరిగినట్టు అధికారులు తెలిపారు. రానున్న మూడ్రోజుల పాటు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వడగాలి ఉదయం10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో చిరు వ్యాపారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్డుపక్కన వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులు కూడా ఎండ తీవ్రతకు అల్లాడుతున్నారు. వేసవి తీవ్రతతో శీతలపానియాల వ్యాపారం ఊపందుకుంది. సాయంత్రం ఐదు గంటల తరువాత బయటకు వచ్చిన ప్రజలు చల్లని పదార్థాలు, మజ్జిగ ప్యాకెట్లు, కొబ్బరిబొండాలకు ఆసక్తి చూపుతున్నారు.