
కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వివాదాస్పదం చేయడం తగదు. నిరసన పేరుతో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. అమలాపురం అగ్నిగుండంగా మారడం వెనుక బలమైన కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలను చీల్చడమే ఆ కుట్రదారుల లక్ష్యం! దీనిని ప్రజలే తిప్పికొట్టాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రజలు పూర్తి స్థాయిలో సంయమనం పాటించాలి. అటువంటి సంయమనమే కుట్రదారుల కపట వ్యూహాల నుంచి సమాజాన్ని కాపాడుతుంది. పెట్రోలు సీసాలు, ఇనుప రాడ్లు, కర్రలతో నిరసనకారులు చెలరేగిన తీరు చూస్తే ఈ సంఘటనలు యాదృచ్ఛికంగానో, అప్పటికప్పుడు జరిగినవిగానో అనిపించడం లేదు. కొద్దిరోజులు సోషల్ మీడియాలో పోస్టులు, అక్కడక్కడ ఆందోళనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వాటి కొనసాగింపుగానే మంగళవారం నాడు చలో అమలాపురం పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం మరో మార్గం లేక ఆందోళన బాట పట్టే వివిధ తరగతుల ప్రజానీకంపైనా, అంగన్‌వాడీలు, మున్సిపల్ వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కూడా పోలీసులు ఎటువంటి నిర్బంధాన్ని అమలు చేస్తారో రాష్ట్ర ప్రజానీకం అనేక సందర్భాల్లో చూశారు. ముందస్తు అరెస్ట్‌లు, హౌస్ అరెస్ట్‌లు, పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించడాలు ఇటీవల కాలంలో సాధారణమయ్యాయి. ప్రజల గొంతు నొక్కడంలో చూపించిన ఈ ఉత్సుకత అమలాపురంలో ఏమైంది? ఎస్‌పిపై రాళ్లు వేసినా, పోలీసులకు గాయాలైనా, సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఇంటిని, ఎంఎల్‌ఏ ఇంటిని సంఘ విద్రోహశక్తులు తగలబెడుతున్నా పోలీస్ యంత్రాంగం ఎందుకు చేష్టలుడిగిపోయింది? వైఫల్యమా...మరేదన్నా కారణమా? ఇప్పటికైనా ఈ కుట్రను వెలికితీసి, బాధ్యులను ప్రజల ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీస్ యంత్రాంగం మీద ఉంది.
నిజానికి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు బలపరిచాయి. కోనసీమ జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పటి నుండి అంబేద్కర్ పేరును ఆ జిల్లాకు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కాస్త, ఆలస్యంగానైనా ప్రభుత్వం ఆ దిశలో చర్యలు తీసుకున్నప్పుడు ఆ పార్టీలన్నీ స్వాగతించాయి. ఈ మొత్తం ప్రక్రియలో బిజెపి మౌనం దాల్చింది. పునర్విభజన సందర్భంగా అనేక జిల్లాలకు స్వాతంత్య్ర సమరయోధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టారు. ఆ ప్రాంతాల్లో ఎక్కడా వ్యతిరేకత రాలేదు. వైఎస్‌ఆర్ పేరుకు, ఎన్‌టిఆర్ పేరుకు, ఇతరుల పేర్లకు రాని వ్యతిరేకత అంబేద్కర్ పేరుకు మాత్రమే ఎందుకు వస్తోందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశం. ఇంత బాహాటంగా పెట్రోలు సీసాలతో అరాచకం స్వైరవిహారం చేస్తుంటే దానిని ప్రతిఘటించి నిలవాల్సిన రాజకీయ పార్టీలు చోద్యం చూడటం, ఆ పేరు అక్కడే ఎందుకంటూ నొక్కులు నొక్కడం, ప్రజాభిప్రాయాన్ని సేకరించాలనడం దారుణం. ఈ వ్యవహారంలో వైసిపి, టిడిపి, జనసేనలు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నాయి. ఈ తరహా రాజకీయ క్రీడ అరాచక శక్తులకు, మనువాదులకు ఊతమియ్యడానికి, మరింతగా బరితెగించడానికి ఉపయోగపడుతుంది. ఇది రాష్ట్ర ప్రజలకు, అభివృద్ధికి ఏ మాత్రం క్షేమం కాదు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలన్న తన వైఖరిని సిపిఎం పునరుద్ఘాటించింది. మిగిలిన పార్టీలు కూడా తమ వైఖరి స్పష్టం చేయాలి. మతం పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనలను చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్రంలోనూ ఆ తరహా ప్రయత్నాలు అక్కడక్కడ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఆ ఉన్మాద శక్తులకు మతమూ, కులమూ ఒక సాకు మాత్రమే! వారికి కావాల్సింది ప్రజలను చీల్చడం, తమ పబ్బం గడుపుకోవడం! అమలాపురం విధ్వంసకాండలోనూ ఆ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి పట్ల ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పౌరసమాజమూ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ విష సంస్కృతిని ప్రారంభంలోనే కూకటి వేళ్లతో సహా పెకిలించివేయాలి. అభ్యుదయ శక్తులు, పురోగమి, ప్రజాస్వామ్యవాదులు ఈ దిశలో కదలాలి. ప్రజలలో చీలికలను తెచ్చే విచ్ఛిన్న శక్తులను అడ్డుకోవాలి.