సంతృప్తికరంగా గరుడసేవ దర్శనం : ఈవో
గరుడసేవ రోజు సంతృప్తిగా వాహనసేవ
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మౌత్సవాలు సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు జరగనున్నాయని, ఇందులో భాగంగా సెప్టెంబరు 22న గరుడసేవకు విశేషంగా విచ్చేసే భక్తులందరూ సంతప్తికరంగా వాహనసేవను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మౌత్సవాల ఏర్పాట్లను గురువారం ఈవో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మౌత్సవాల మొదటిరోజైన సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. గరుడసేవ నాడు దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని చెప్పారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి 2 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతామని తెలియజేశారు.
శ్రీవారి ఆలయం నుండి వాహన మండపం, మాడ వీధులు, బేడి ఆంజనేయస్వామివారి ఆలయం, సుపథం, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 తదితర ప్రాంతాలను ఈవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఏర్పాట్లను పరిశీలిస్తున్న టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి










