Aug 14,2023 18:20

ప్రజాశక్తి - భీమవరం
స్పందనలో వచ్చిన దరఖాస్తులను అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా జాయింటు కలెక్టరు ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి ప్రజలు నుండి వచ్చిన 206 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన దరఖాస్తులు మళ్లీ రీ ఓపెన్‌ అవ్వని విధంగా పరిష్కారం చూపాలన్నారు. సుదూర ప్రాంతాల నుండి మన మీద నమ్మకంతో వారి సమస్యల పరిష్కారానికి వస్తారని, అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు.
సమస్యలు ఏకరువు
తాను కులాంతర వివాహం చేసుకున్నాను, తనకు కళ్యాణమస్తు పథకం ద్వారా ప్రభుత్వ సాయం మంజూరు చేయాలని పాలకొల్లు 18వ వార్డు బెత్లహాంపేటలో నివాసం ఉంటున్న కొండేటి దివ్య తెలిపారు. మొగల్తూరు మండలం శేరేపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి శ్రీనివాసరావుకు చెందిన భూమి కొంతమంది వ్యక్తులు ఆక్రమించి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని న్యాయం చేయాలని కోరారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామానికి చెందిన గుబ్బల వరలక్ష్మి ఇల్లు కట్టుకున్నానని, తన కుమారుడు ఇంటి నుంచి గెంటేశాడని తిరిగి తన ఇల్లు తనకు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ శాఖ అధికారి జివికె మల్లికార్జునరావు, డిఎల్‌డిఒ కెసిహెచ్‌ అప్పారావు, డిఎస్‌పి బి.శ్రీనాథ్‌, అధికారులు పాల్గొన్నారు.