ప్రజాశక్తి-పాడేరు: అన్ని సంతలలో నిఘా వేస్తామని రేషన్ బియ్యాన్ని అమ్మితే లబ్దిదారుల కార్డుల రద్దు చేస్తామని సంయుక్త కలెక్టర్ జె.శివ శ్రీనివాసు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వినియోగదారుల చైతన్య సదస్సులో జెసి మాట్లాడుతూ, విద్యార్థులు గ్రామాలలో వినియోగదారుల క్లబ్బులను ఏర్పాటు చేసుకొని వస్తువుల నాణ్యతను పరిశీలించాలన్నారు. వినియోగదారుల చట్టంలో వినియోగదారుల హక్కుల తో పాటు, తయారీదారుల బాధ్యతలు కూడా ఉన్నాయని, చట్ట ప్రకారం మోసపూరిత ప్రకటనలు, తప్పుడు కొలతలు, వివరాలు ప్రకటిస్తే శిక్షార్హులవుతారని వివరించారు. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం కిలో రూపాయికే బియ్యం, కందిపప్పు కిలో రూ.67లు, పంచదార కిలో రూ. 17లు అమ్ముతుందని, వాటిని అధిక ధరకు లేదా తక్కువ బరువుకు అమ్మితే వారు కూడా శిక్షార్హులవుతారని తెలిపారు. కొంతమంది రేషన్ షాపు వినియోగదారులు కిలో రూపాయి చొప్పున బియ్యం కొని బయట వ్యక్తులకు అమ్ముతున్నారని, ఇది నేరమేనని జెసి. చెప్పారు. ఈ విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులను చైతన్య పర్చాలన్నారు. ముఖ్యంగా రేషన్ షాపులలో లభించే బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కలుస్తుందని, అది అత్యంత బలవర్దకమైనందున ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యాన్ని వినియోగించు కోవాలన్నారు.
వస్తువులు పరిశీలించాలి :పిఒ
ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ, వస్తువులు కొనేముందు నాణ్యత, బరువు, ధర, బ్రాండ్ తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.ఆరోగ్య భద్రత సూచికలు, మార్కింగులు లేబిల్ పరిశీలించి మాత్రమే కొనుగోలు చేయాలని, లేకుంటే వినియోగదారుడు మోసపోయే అవకాశం ఉంటుందని వివరించారు.సంతలలో నాణ్యత లేని వస్తువులు, నిలువ సరుకులు, మోసపూరిత వస్తువులు అమ్మే అవకాశం ఉన్నందున జాగ్రతగా పరిశీలించి కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువు రసీదు, బిల్లు పొందాలని తెలిపారు. ఆ వస్తువు నాణ్యతలో లేదా ఉంటె వెంటనే షాపు వారికి, లేదా వినియోగారుల ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు.
సబ్ కలెక్టరు వి.అభిషేఖ్ మాట్లాడుతూ ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రసీదులో పూర్తి వివరాలు ఉండాలని లేకుంటే రశీదు చెల్లదని, దాని ఆధారంగా ఫిర్యాదు చేయలేమని తెలిపారు. వస్తువు తయారి తేది, ముగింపు ఉంటాయని, వాటిని కూడా గుర్తించాలని సూచించారు. వినియోగదారుల హక్కుల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శివ ప్రసాద్, పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ గణేష్ కుమార్, జిల్లా వైద్య శాఖాధికారి జమాల్ భాష, జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్, జిల్లా ఆహార భద్రత అధికారి వేణుగోపాల్, లీగల్ మెట్రాలజి అధికారి అనురాధ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిట్టబ్బాయి, జిల్లా వినియోగదారుల స్వచ్చంద సంస్థ అధ్యక్షులు నానిబాబు పాత్రుడు, మండల వినియోగదారుల సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.










