Jun 24,2023 20:22

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
సంతానం లేని వారికి జులై 2న పట్టణంలోని వాసవీ కల్యాణ మందిరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఐ, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు నగేష్‌ కాకుబాళ్‌ తెలిపారు. శనివారం ఎస్‌కెడి కాలనీ 3వ రోడ్డులోని వైట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆవోపా, ఆవోపా మహిళా విభాగ్‌ ఆధ్వర్యంలో కర్నూలు ప్రైమ్‌ ప్లస్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ వారి సౌజన్యంతో తన సొంత ఖర్చులతో ఉచితంగా ఐవిఎఫ్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజ సేవ చేయాలనే సంకల్పంతో గతంలో రెండు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 252 మందికి ఆపరేషన్లు చేయించామని చెప్పారు. కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో నిర్వహించిన ఆపరేషన్లకు వెళ్లిన వారికి రవాణా, భోజన వసతి ఏర్పాటు చేశామని తెలిపారు. నిరుపేద కుటుంబాలు సైతం పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని ఒక్కొక్కరికి సుమారు రూ.25 వేల విలువ చేసే వైద్యాన్ని అందిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు వంకదారు శ్రీనాథ్‌ గుప్త, మిరియాల శ్రీధర్‌ తెలిపారు. శిబిరంలో ఉచిత ఒపి, రిజిస్ట్రేషన్‌, స్త్రీ, పురుషులకు ఉచిత సలహాలు, రక్త పరీక్షలు, అర్హులైన వారికి వీర్య పరీక్షలు (సెమిన్‌ ఎనాలిసిస్‌), ఐయుఐ టెస్ట్‌, ఐవిఎఫ్‌ కన్సల్టేషన్‌ ఉచితంగా కర్నూలులోని ప్రైమ్‌ ప్లస్‌ ఫెర్టిలిటీ సెంటర్‌లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంతానం లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేర్ల రిజిస్ట్రేషన్‌ కోసం 8977778184, 9550444641 సంప్రదించాలని కోరారు. ఇతర వివరాల కోసం 9849478178, 9490576399, 9849057205 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు. సభ్యులు ప్రతాప్‌, ఈరన్న, రాఘవేంద్ర, రంగనాయకులు, మహిళా విభాగ్‌ సభ్యులు సంగీత, మమతశ్రీ, హిమబిందు ఉన్నారు.