ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన సంస్కరణల వల్ల పంచాయితీ స్థాయిలో అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పనతో ప్రజలకు సుపరిపాలన అందించటానికి అవకాశం ఏర్పడిందని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయిలో జాతీయ పంచాయితీ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం గ్రామ స్థాయిలో మెరుగైన పౌరసేవలు అందించటానికి 11 మంది యువ ఉద్యోగులతో సచివాలయ వ్యవస్థను, రైతులకు అవసరమైన సహాయం అందించటానికి ఆర్బీకేలు, మెరుగైన వైద్యసేవలు అందించటానికి హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తోందన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచటానికి అర్హతున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలతో పాటు, ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి స్థలంతో పాటు, ఇల్లు నిర్మించే కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం జెసి రాజకుమారి మాట్లాడారు. జిల్లాస్థాయిలో జాతీయ పంచాయితీ అవార్డులు సాధించిన సర్పంచులు డి.నాగపుణ్యేశ్వరరావు (అత్తోట), కొల్లి రజని (బొమ్మూవానిపాలెం), శ్రీనివాసరావు (కుంచవరం), రావెల శైలజ (రావెల), చిమటా వెంకటేశ్వర్లు (ముక్కామల), పంచాయతీ సెక్రటరీ షరీఫ్ (లచ్చన్నగుడిపాడు)ను కలెక్టర్, జెసి సత్కరించి ధ్రువపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతి అధికారి కేశవరెడ్డి, జెడ్‌పి సిఇఒ మోహనరావు, పంచాయితీ రాజ్ ఎస్‌ఇ బ్రహ్మయ్య, ఆర్‌డబ్ల్యూయు ఎస్‌ఇ సురేష్, ఎంపిడిఒలు, పంచాయతి కార్యదర్శులు పాల్గొన్నారు.










