May 24,2023 23:43

మాట్లాడుతున్న ఎంపీ ఎంవివి.సత్యనారాయణ

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : సంసద్‌ ఆదర్స్‌ గ్రామ యోజన (ఎస్‌ఎజివై) ద్వారా గ్రామాల్లో పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం పార్లమెంట్‌ సభ్యులు ఎంవివి.సత్యనారాయణ అధ్యక్షతన సంసద్‌ ఆదర్స్‌ గ్రామ యోజన పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, గ్రామ సర్పంచులు స్థానిక ఎంపిటిసి, ఎంపిపి సహకారంతో సంసద్‌ ఆదర్స్‌ గ్రామ యోజనలో చేయాల్సిన పనులు గుర్తించి సంబంధిత ప్రతిపాదనలను ఎండిఒలకు అందజేయాలన్నారు. ఎండిఒలు పార్లమెంట్‌ సభ్యులకు అందజేస్తే ఎంపీ నిధుల ద్వారా పనులు మంజూరవుతాయని చెప్పారు.
ఎంపీ ఎంవివి.సత్యనారాయణ మాట్లాడుతూ, గ్రామాలలో ఎండిఒ సర్వేచేసి అవసరమైన పనులు గుర్తించాలన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న నిధుల లభ్యతను బట్టి కేటాయింపు చేసి మిగిలిన పనులకు తగు ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహణాధికారి శ్రీరామమూర్తి, జిల్లా అధికారులు, అనంతవరం, పద్మనాభం, మద్ది, ఆనందపురం, గండిగుండం, వెళ్లంకి గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.