Nov 29,2022 23:08

  • రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

ప్రజాశక్తి-విజయవాడ: ప్రాచీన సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అత్యధిక నిధులు కేటాయించడం ద్వారా పెద్దపీట వేస్తున్నారని ఏపీ ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తమిళనాడులోని ఇరోడ్‌లో జరిగిన 3వ జాతీయ ట్రెడిషినల్‌ సిలంభం (కర్రసాము) ఛాంపియన్‌ షిప్‌ - 2022 టోర్నీలో పతకాలు సాధించిన క్రీడాకారులు మంగళవారం ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయం జనహిత సదనములో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను మల్లాది విష్ణు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సింగిల్‌ హ్యాండ్‌, డబుల్‌ హ్యాండ్‌ విన్యాసాలు అలరించాయి. కర్రసాము ప్రాచీన యుద్ధకళలలో ఒకటని.. దానిని రేపటితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జరిగిన టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమన్నారు. రాష్ట్రం నుంచి పాల్గొన్న 24 మంది క్రీడాకారులలో.. నగరానికి చెందిన 10 మంది చిన్నారులు పతకాలు సాధించడం హర్షణీయమన్నారు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేతత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం క్రీడల ప్రాధాన్యతను గుర్తించి.. పాఠశాల స్థాయి నుంచే క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. కర్రసాము నేర్చుకోవడం వల్ల ఏకాగ్రత, ధైర్యం, ఆరోగ్యం, ఆత్మరక్షణ లభిస్తుందని వెల్లడించారు. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడా పోటీలలో ప్రోత్సహించాలని కోరారు. ఈనెల 25, 26, 27 తేదీలలో జరిగిన టోర్నీలో అండర్‌ 12 విభాగంలో ఎం.హియా జైన్‌(10), ఎన్‌.యశస్వి(11) స్వర్ణం, కె.రిషికేష్‌(11) కాంస్యం., అండర్‌ 14 విభాగంలో జి.ఆరుష్‌(12) రజతం., అండర్‌ 10 విభాగంలో ఎన్‌.కశ్యప్‌(9) రజతం., రంజిత్‌ (9) కాంస్యం, అండర్‌ 8 విభాగంలో బి.మేఘనా రతన్‌(5) రజతం, కారుణ్య(8) కాంస్య పతకాలు సాధించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్‌ అవుతు శ్రీశైలజారెడ్డి, కార్పొరేటర్లు ఇసరపు దేవీ రాజారమేష్‌, ఉమ్మడి రమాదేవి, యరగొర్ల తిరుపతమ్మ, ఎండి షాహినా సుల్తానా, ఉద్ధంటి సునీత, మోదుగుల తిరుపతమ్మ, కుక్కల అనిత, కొంగితల లక్ష్మిపతి, శర్వాణి మూర్తి, కోచ్‌ సత్య శ్రీకాంత్‌, హరికుమార్‌, సోమశేఖర్‌, చిన్నారుల తల్లిదండ్రులు స్వప్నశ్రీ పాల్గొన్నారు.