సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నయ్యపడాల్
ప్రజాశక్తి-కొయ్యూరు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సంపన్నులకు రాయితీలు ఇస్తూ, సామాన్యులపై భారాలు వేస్తుందని సిఐటియు అల్లూరు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. సిఐటియు కొయ్యూరు మండల మహాసభ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వై.అప్పలనాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయని, దీంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. మరో వైపు పెద్దలు ప్రయాణించే ప్రైవేటు విమానయాన సంస్థలకు ఇంధనం ధరలు తగ్గించడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి ఎవరిపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు. వాస్తవంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నులే అధికంగా ఉన్నాయని తెలిపారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20 21 తేదీల్లో జరుగు సిఐటియు అల్లూరు జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం 13 మందితో మండల నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వెంకటరమణమ్మ, రత్నం, ఆశావర్కర్లు దేవుడమ్మ, సావిత్రి, చిలకమ్మ, మిడ్డేమీల్స్ కార్మికులు కన్నయమ్మ, దార, రమణమ్మ, మణి, విఒఎ మల్లేష్, హాస్టల్ వర్కర్ రమణ, గిరిజన సంఘం నాయకులు సూరిబాబు పాల్గొన్నారు.










