Aug 27,2023 23:14

మాట్లాడుతున్న సుబ్బన్న

* దళితుల భూములు వారికే దక్కాలి
* కెవిపిఎస్‌ రాష్ట్ర నాయకులు ఎం.సుబ్బన్న
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
అసైన్డ్‌ భూముల చట్ట సవరణ సంపన్నుల కోసమేనని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర నాయకులు మద్దిల సుబ్బన్న అన్నారు. కెవిపిఎస్‌ ఆధ్వర్యాన 'క్విట్‌ వివక్ష-క్విట్‌ మతోన్మాదం' నగరంలోని అంబేద్కర్‌ విజ్ఞాన మందిరంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్ర వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటుతున్నా దళితుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉందన్నారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచి పెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది నిరుపేదలైన దళిత కుటుంబాలకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నారని విమర్శించారు. మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చి, లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందన్నారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అదే బాటలో పయనిస్తోందని విమర్శించారు. దళితుల అసైన్డ్‌ భూములను పెత్తందారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దళితులకు మేలు చేకూర్చే కోనేరు రంగారావు, జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దళితుల భూములు దళితులకే దక్కాలని, రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన సంక్షేమ పథకాలన్నీ తిరిగి పునరుద్ధరించి అమలు చేయాలన్నారు. నిరుపేద దళిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోగా వారిపై భారాలు మోపుతోందని విమర్శించారు. హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కె.రాంగోపాల్‌ మాట్లాడుతూ అట్రాసిటీ వంటి చట్టాలు ఎన్ని వచ్చినా దళితులపై దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదన్నారు. దళితుల రక్షణ కోసం మరిన్ని చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. దళిత, గిరిజన బహుజనులపై దాడులకు మణిపూర్‌, హర్యానా, కడియం తదితర ఘటనలే తార్కాణమన్నారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి చిన్నారావు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి.కృష్ణమూర్తి, బోనెల అప్పారావు, బోసు మన్మథరావు, ఎ.గణేష్‌, ఎం.సూర్యనారాయణ, ఆర్‌.చిన్నారావు, సిహెచ్‌.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
అనంతరం కెవిపిఎస్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా మామిడి సూర్యనారాయణ, కార్యదర్శిగా రాకోటి చిన్నారావు, ఉపాధ్యక్షులుగా ఎ.గణేష్‌, సిహెచ్‌.లక్ష్మణరావు, టి.తిరుపతిరావు, సహాయ కార్యదర్శులుగా బి.ఎర్రయ్య, టి.రామారావు, జి.ఇల్లయ్య మరో 12 మందిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.