ప్రపంచమంతటా ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతుంటే కొద్దిమంది సంపన్నుల వద్ద శత కోట్ల డాలర్లు పోగుబడుతున్న వైనం తీవ్ర ఆశ్చర్యం గొలుపుతోంది. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన (35వ వార్షిక) సంపన్నుల జాబితాలో విస్తుగొలిపే అనేక అంశాలున్నాయి. ఆర్థిక మాంద్యానికి తోడు కోవిడ్ విపత్తు మూలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతున్నదనీ, విశ్వ వాణిజ్యం విలువ తొమ్మిది శాతం క్షీణించిందని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి అనేక సంస్థలు పుంఖానుపుంఖాలుగా నివేదికలు వెలువరిస్తుంటే ఈ జాబితా సంపన్నుల వద్ద సంపద మరింత ఎక్కువగా పోగుపడిందని పేర్కొంది. ప్రపంచంలోని 2,755 మంది సంపన్నుల వద్ద 13.1 లక్షల కోట్ల డాలర్ల (ఒక డాలర్‌కు 75 రూపాయలు) సంపద పోగుపడిందని తెలిపింది. గత ఏడాది 2,095 మంది శత కోటీశ్వరుల సంఖ్య కాగా ఈ ఏడాది మరో 660 మంది ఆ రేంజికి ఎదిగారు. కాబట్టి ప్రపంచమంతా దివాలా తీస్తున్నా ఆ కొద్దిమంది మాత్రం మరిన్ని కోట్లు కూడబెట్టుకుంటున్నారన్నమాట. అంటే ప్రపంచ ప్రజలందరు కోల్పోతున్న సంపద ఆ కొద్దిమంది వద్ద కేంద్రీకరించబడుతోందని విదితమవుతోంది. ఇంకా చెప్పాలంటే జనమంతా ఈతి బాధల్తో కొట్టుమిట్టాడుతుంటే కొద్దిమంది శత సహస్ర కోటీశ్వరులు మరింత దిలాసాగా చలాయిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతున్న కొద్దీ సంపన్నుల వద్ద మరింత సంపద పోగు పడుతుండడమే నేటి నయా ఉదారవాద ఆర్థిక విధానాల అసలు రూపం.
భారత్ జిడిపి వృద్ధి రేటు 2020లో 7.5 శాతం క్షీణించిందని సాక్షాత్తూ కేంద్రప్రభుత్వమే చెప్పింది. కాగా ఫోర్బ్స్ నివేదిక సంపన్నుల సంఖ్య 102 నుండి 140కి పెరిగిందనీ వారివద్ద పోగు పడిన సంపద కూడా 59,600 కోట్ల డాలర్లకు 'వృద్ధి' చెందిందనీ పేర్కొంది. సంపన్నులున్న దేశాల్లో అమెరికా, చైనా తరువాతి స్థానం భారత్‌దేనని తెలిపింది. అంతేగాక రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఎదగడం గమనార్హం. దేశంలో పేదలు, పేదరికం విపరీతంగా వృద్ధి చెందడం, ప్రపంచ ఆకలి సూచీలో 117 దేశాల్లో భారత్ 102వ స్థానంలోవున్న నివేదిక ఒకవైపు ఫోర్బ్స్ జాబితా మరోవైపు కఠోర వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. భారత సంపన్నుల్లో రెండవ స్థానంలో వున్న గౌతమ్ అదానీ సంపద ఏడాది కాలంలో ఏకంగా ఐదు రెట్లు పెరిగిందని ఫోర్బ్స్ స్పష్టం చేసింది. మొదటి మూడు స్థానాల్లోని అంబానీ, అదానీ, శివ నాడార్ల సంపద పది వేల కోట్ల డాలర్లు (రూ.7.5 లక్షల కోట్లు). అంటే 140 మందిలో ముగ్గురికే సుమారు 17 శాతం సంపద పోగుపడిందంటే సంపన్నుల్లో సైతం అంతరం చాలా ఎక్కువగా వుందన్నమాట.
దేశంలో నాలుగో సంపన్నుడైన డీ మార్ట్ అధినేత రాధాకృష్ణ దమానీ తమ కుటుంబం కోసం ఇటీవల ముంబాయిలోని మలబార్ హిల్స్‌లో అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఇల్లు కొనుగోలు చేశారు. ఆ సొమ్ముతో బలహీన వర్గాలకు గృహాలు నిర్మిస్తే సుమారు 20 వేల కుటుంబాలకు నీడనివ్వొచ్చు కదా! అలాగే కోవిడ్ టీకాను పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్న 'సీరం ఇండియా' అధినేత సైరస్ పూనావాలా ఈ ఏడాది 1,270 కోట్ల డాలర్లతో ఏడవ స్థానానికిి ఎగబాకారు. కోవిడ్ వైరస్ వల్ల దేశంలో లక్షల మంది ప్రాణాలు పోయాయి... కోట్లాది కుటుంబాలు కకావికలమయ్యాయి... కానీ పూనావాలాకు మాత్రం వందల కోట్ల డాలర్లు పోగుబడింది. అంటే దేశ ప్రజలపాలిటి శాపమైన కరోనా ఆయనకు వరంగా మారిందన్నమాట. ఆహా.. ఏమి ఈ వైపరీత్యము! ప్రజలందరి సంపదను కొల్లగొట్టి కొందరికి కట్టబెట్టే నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణం.
నిరంతరం కష్టించి సంపద సృష్టించే శ్రమజీవికి ఆ ఫలితం దక్కకుండా బడా కార్పొరేట్లు కాజేస్తున్నారన్నది కఠోర వాస్తవమనడానికి ఫోర్బ్స్ పత్రిక జాబితాను సైతం ఒక సాక్ష్యంగా పేర్కొనవచ్చు. కాని, ఆ దోపిడీకి గురయ్యే అశేష ప్రజానీకం ఈ వాస్తవాన్ని గమనించకుండా వారిని మభ్యపెట్టేందుకు పాలకవర్గ బాకాలు 'దేశం ముందుకు పోతోంది', 'జిడిపి వృద్ధి చెందింది', 'సంపన్న దేశాల సరసన భారత్' వంటి నినాదాలను ముమదుకు తెస్తున్నాయి. 'సంపద సృష్టికర్తలు' అంటూ స్వయానా మోడీ అంబానీ అదానీలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ నయవంచన కోట్లాది భారతీయుల ఆకలి తీర్చదు; పేదరికాన్ని రూపు మాపదు. కార్పొరేట్ల అమానవీయ దోపిడీని రూపుమాపే ఉద్యమాలే నిజమైన పరిష్కారం.










