ప్రజాశక్తి-అనంతగిరి:మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులు నిర్వహించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేపట్టి 4. నెలలు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభం కాలేదు.అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు మండలాల సరిహద్దు పిటిజీ గ్రామాలకు పాడేరు కనెక్టివిటీ కింద రోడ్డు సౌకర్యం మంజూరు అయింది. పనులు ప్రారంభించేందుకు మండల ప్రజాప్రతినిధులు గత నాలుగు నెలల క్రితం శంకుస్థాపన చేపట్టారు. పనులు ప్రారంభించేందుకు గుత్తేదరులు సిద్ధంగా ఉన్నప్పటికీ ఫారెస్ట్ శాఖ అధికారులు రోడ్డు పనులకు ఆటంకం పరుస్తుడటంతో శంకుస్థాపనతో సరిగా మారింది.అనంతగిరి మండలం అనంతగిరి పంచాయతీ రాజుపాక గ్రామం నుండి డెక్కపూరం మీదుగా హుకుంపేట మండలం పటక దౌవడ గ్రామం వరకు సుమారు 2. కోట్ల 50 లక్షలు ట్రైబల్ వెల్ఫేర్ నిధులు మంజూరు అయ్యాయి. పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్త పరచడంతో పనులు ముందుకు జరగకుండా నిలిచిపోయాయి. తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు మోక్షం లభిస్తుందని ఆశ పడ్డ పి.టి.జి ప్రజలకు నిరాశే మిగిలింది.ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని మంజురైనా రోడ్డు పనులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.










