ప్రజాశక్తి - నరసరావుపేట : పల్నాడు ప్రజల చిరకాల స్వప్నమైన వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు, గిరిజన, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్‌ను కలెక్టరేట్‌లో శుక్రవారం కలిసి వినతిపత్రం ఇచ్చి పరిస్థితిని వివరించారు. జలవరుల ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిబూషన్ దృష్టికి తీసుకువెళ్లి పనులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ చెప్పారు. అనంతరం విలేకర్లతో ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును పాలకపార్టీలు తమ రాజకీయానికే వాడుకుంటున్నాయని, ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారినా పనులు మాత్రం చేపట్టలేదని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇద్దరు సిఎంలు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని జలవనరుల శాఖను జిల్లా కలెక్టర్‌ను, పల్నాడు మంత్రులను, ఎంపి, ఎమ్మెల్యేలను పల్నాడు ఎమ్మెల్యేలు స్పందించి ఆయా మండలాల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పనులు ప్రారంభించేలా ఒత్తిడి తేవాలని కోరారు. వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వెల్దుర్తి, బొల్లాపల్లి, దుర్గి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు, 100 గ్రామాలకు త్రాగునీరు అందుతుందన్నారు. దుర్భిక్షంలో ఉన్న ఈ ప్రాంతమంతా కూడా శ్యామలం కావాలంటే వరికపూడిశెల ద్వారానే సాధ్యమన్నారు. ప్రాజెక్టు పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షణ నుండి అనుమతులు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్నా పనుల్లో జాప్యం ఎందుకున్నారు. సిపిఎం సీనియర్ నాయకులు గద్దె చలమయ్య మాట్లాడుతూ టిడిపి హయాంలో చివరి కాలంలో పాలన అనుమతులు, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చినా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. వరికపూడిశెలకు సంబంధించి చేసిన కృషిలో ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు కొంతమేర విజయం సాధించారన్నారు. పనులు చేయాలనుకుంటే అటవీ అనుమతులు, వన్యప్రాణి సంరక్షణ అనుమతులు పెద్దగా అడ్డంకి కాదన్నారు. పనులు చేస్తూ కూడా అనుమతుల కోసం ప్రయత్నం చేయొచ్చన్నారు. విశాఖ జిల్లా మన్యం ప్రాంతాల్లో అటవీ భూముల్లో బాక్సైడ్ తవ్వకాలకు, కృష్ణపట్నం ఓడరేవు నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు వేస్తున్న పెట్రోల్ పైప్‌లైన్ అటవీ భూముల్లో గుండా వెళుతుందని వాటికి వెను వెంటనే వస్తున్న అనుమతులు రైతులు ప్రజల ప్రయోజనార్థం చేపట్టే వరికపూడిశెల నిర్మాణానికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సాగర్ జలాశయానికి వచ్చే నీరు కడపకు వెళుతున్నా చెంతనే ఉన్న మండలాలలో మాత్రం నీటి సమస్య వెంటాడుతోందన్నారు. అనంతపురం కంటే రాష్ట్రంలో అత్యంత దారుణంగా నీటి కరువు పరిస్థితులు పల్నాడులోని దుర్గి, వెల్దుర్తి, బొల్లాపల్లి, పుల్లలచెరువు మండలాలు ఎదుర్కొంటున్నయని చెప్పారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేవరకూ దశలవారీగా పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతుసంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ సరిపడా నిధులు కేటాయించి తక్షణమే నిర్మాణ పనులు జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్, గిరిజన సంఘం నాయకులు వి.కోటా నాయక్, రైతు సంఘం నాయకులు నాయక్, గిరిజన సంఘం నాయకులు బి.శ్రీను నాయక్, పిడిఎం సభ్యులు ఎన్.రామారావు, పికెఎస్ నాయకులు కె.ఏడుకొండలు, కెఎన్‌పిఎస్ నాయకులు జి.ప్రసాద్, జె.బ్రహ్మయ్య, కేశవరావు, సిఐటియు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కె.హనుమంతరెడ్డి, ఎస్.ఆంజనేయ నాయక్, సిహెచ్.కోటిరెడ్డి, ఎం.బక్కిరెడ్డి, కౌలురైతు సంఘం నాయకులు బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.










