Nov 08,2023 21:03

వర్షాభావంతో ఎండిపోయిన వేరుశనగ పంట

కడప ప్రతినిధి : జిల్లాలో వ్యవసాయం సంక్షోభంలో పడింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎటుచూసిన తీవ్ర దుర్భిక్ష పరిస్థితులే తాండవం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కడప జిల్లాకు చోటు దక్కకపోవడం విస్మయాన్ని కలిగించింది. అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదించిన కరువు మండలాలు కుదింపునకు గురికావడం ఆందోళన కలిగించింది. ఒకవైపు కొనసాగుతున్న తీవ్ర వర్షాభావం, మరోవైపు అడుగంటిన భూగర్భజలాలతో వ్యవసాయం గల్లంతు కావడం, పశుగ్రాసం కొరవడిన ఫలితంగా పాడి పరిశ్రమ పడకేసిన నేపథ్యం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో కరువు మండలాల గుర్తింపులో చోటుచేసుకున్న అన్యాయాన్ని సరిదిద్దడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కథనం
జిల్లాలో వ్యవసాయ రంగం గల్లంతైంది. ఖరీఫ్‌ తరహా వర్షాభావ పరిస్థితులే రబీ సీజన్‌ను చుట్టుముట్టేశాయి. ఫలితంగా రబీ సీజన్‌ సాగు విస్తీర్ణమైన 3.72 లక్షల ఎకరాల్లో 90 శాతం విత్తనం పడని విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రతిఏటా వ్యవసాయానికి ఖరీఫ్‌, రబీ సీజన్‌లే ఆధారం. రబీ సీజన్‌లో ఆశించిన వర్షపాతం నమోదు కావడం తెలిసిందే. ఇందులోభాగంగా అత్యధిక విస్తీర్ణంలో పంటలు సాగు కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గల్లంతైంది. మిగిలిన రబీ సీజన్‌పైనే రైతుల ఆశలు. ఇటువంటి గుండెకాయలాంటి రబీ సీజన్‌ సైతం ఖరీఫ్‌ తరహా తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల చుట్టుముట్టిన నేపథ్యం ఆందోళన కలిగిస్తోంది.
ప్రభుత్వానికి కనిపించని కరువు!
జిల్లాను దుర్భిక్షం చుట్టిముట్టింది. 2023-24 ఖరీఫ్‌, రబీ సీజన్‌లు దుర్భిక్షం బారిన పడినప్పటికీ పాలకులకు కనిపించడం లేదు. జిల్లా రబీ విస్తీర్ణం 3.72 లక్షల ఎకరాల్లో 48 వేల ఎకరాల్లో నే విత్తనం పడింది. ఈలెక్కన 13.4 శాతం విస్తీర్ణంలో మాత్ర మే విత్తనం పడినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ కరువు గుర్తింపు పారామీటర్ల ప్రకారం విత్తనం పడిన తర్వాత ఎండిపోవడం, తాగు నీటి సరఫరా లేకపోవడం వంటి పారామీటర్లు ఉన్న నేప థ్యంలో విత్తనమే భూమిలో పడని పరిస్థితుల్లో కరువు నిర్ధారణ పారా మీటర్ల ఆధారంగా కరువు పరిస్థితుల్ని ఎలా లెక్కిస్తారో తెలియడం లేదు. జిల్లాలో వ్యవసాయం గల్లంతైన నేపథ్యంలో ప్రధాన జీవనా ధారం ప్రశ్నార్థకంగా మారింది. ఫలితంగా పశుగ్రాసం కొరవడిన పాడి పరిశ్రమ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ ప్రశ్నార్థకంగా మార డంతో ప్రజానీకంపై పెనుప్రభావం పడింది.
కరువు ప్రకటనలో జిల్లాకు చోటేదీ
రాష్ట్రంలో 103 మండలాలు కరువు బారిన పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈనేపథ్యంలో కడప జిల్లాలో 17 మండలాలు, అన్న మయ్య జిల్లాలో 23 మండలాలు కరువు బారిన పడ్డాయని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు అందజేయడం తెలిసిందే. జిల్లా ప్రతిపాదనల ఆధారంగా రాష్ట్రప్రభుత్వం కడప జిల్లాకు తీవ్ర అన్యాం చేసింది. అన్నమయ్య జిల్లాకు 18 మండలాలకు పరిమితం చేసింది. ఇటువంటి తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు ఏడు మీటర్లకుపైగా పడిపోతుండడం విస్మయాన్ని కలిగిస్తో ంది. ఒకవైపు వ్యవసాయరంగం, పాడి పరిశ్రమ రంగంపై పెను ప్ర భావం పడిన నేపథ్యంలో ప్రజానీకం జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా ప్రజా రోగ్యంపై పెనుప్రభావం చూపిస్తోంది. ఇటువంటి దారుణ దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ పాలకులకు పట్టకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. జిల్లాలో ఇటువంటి తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న నేపథ్యంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.