Aug 25,2023 22:38

మీడియాతో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-నెల్లూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివద్ధి పనుల పేరుతో రైతుల నుంచి బలవంతంగా కొన్ని లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం నగరంలోని సిపిఎం జిల్లా కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్‌మాల, భారత్‌ మాల పేర్లతో రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణం కోసం వేల ఎకరాల భూములను రైతుల నుంచి గుంజుకుంటున్నారన్నారు. ఎస్‌ ఈజడ్‌ ఏర్పాటు, పైపు లైన్లు నిర్మాణం పేరుతో, ఇలా ఒకటి కాదు.. ప్రస్తుతం కొత్తగా విద్యుత్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ పేరుతో , విండ్‌, సోలార్‌ పేరుతో కొన్ని వేల ఎకరాల భూమిని రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నారన్నారు. గ్రామ సభలు, సమావేశాలు నిర్వహించకుండా , రైతుల అభిప్రాయ సేకరణ నిర్వహించకుండా ఒక్క రాయలసీమ ప్రాంతంలైన అనంతపురం, కర్నూలు జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా రైతుల నుంచి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. రైతుల నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకొన్న భూములను ప్రభుత్వాలు అంబానీకి, అదాని వంటి పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నాయన్నారు. దీని వల్ల వ్యవసాయ రంగం కుదేలవుతుందన్నారు. 2013 భూ సేకరణ చట్టం మేరకు, మార్కెట్‌ విలువ ప్రకారం, అందుకు నాలుగు రెట్లు రైతులకు పరిహారంగా అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఆ ప్రాంతంలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న వారికి పింఛన్‌ అందజేయాలన్నారు. చట్టబద్ధంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, పరిహారం అందించే రీతిలో ప్రభుత్వం పని చేయాల న్నారు. అభివద్ధి అంటే ప్రజలకు భాగస్వామ్యం ఉండాలన్నారు. అభివద్ధి పేరుతో కార్పొరేట్‌ సంస్థలకు దోచి పెట్టడం తప్ప మరొకటి కాదని ఆయన అభిప్రా యపడ్డారు. ప్రభుత్వం రైతుల భూములను స్వాధీనం చేసుకున్న సమయంలో 2013 చట్టం ప్రకారం మార్కెట్‌ రేటుకు నాలుగు రెట్లు అధికంగా నగదు చెల్లించాల్సిందేనన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం లెక్క చేయకుండా రైతులను పోలీసులతో బెదిరించి కేసు నమోదు చేసి భూము లను గుంజుకోవడం ఆపడం లేదన్నారు. గత ప్రభుత్వ హాయంలో గానీ, ఈ ప్రభుత్వ హయాంలో గానీ రైతుల నుంచి తీసుకున్న భూములను అభివద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. ఎస్‌ఈజెడ్‌లు, పరిశ్రమలు, ఇండిస్టియల్‌ కారిడార్‌లు, గ్రోత్‌ సెంటర్లు పేరుతో దాదాపుగా రెండున్నర లక్షల ఎకరాల భూములను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నారన్నారు. భూములు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిన దాఖలాలు లేవన్నారు. ఎక్కడ పరిశ్రమలు స్థాపించకుండా, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా , ఉపాధి కల్పన చేయకుండా ఇన్ని వేల ఎకరాల భూములను ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు. దాదాపు 26 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన వాన్‌పిక్‌, సత్యసాయి జిల్లాలో 8వేల 500 ఎకరాల్లో నాలెడ్జ హబ్‌ ఏర్పాటు చేసేందుకు భూములు తీసుకుంటే ప్రస్తుతం అక్కడ ఏమి లేదన్నారు. వ్యవసాయాన్ని దెబ్బతీసి, పరిశ్రమలు స్థాపించకపోతే రాష్ట్రం ఎక్కడ అభివృద్ది చెందుతుందని ఆయన ప్రశ్నించారు. కేవలం రియల్‌ఎస్టేట్‌ వారి కోసమే రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని గ్రామాలను యూనిటిగా తీసుకొని ప్రతి రైతు సర్వే నెంబర్‌ను చేర్చి కరువు ప్రాంతంలోని అందరికి పరిహారం అందజేయాలన్నారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీలు అందజే యాలన్నారు. తిరిగి పంటలు పండించేందుకు సహకారం అందజేయాలన్నారు. వర్షాకాలం అయినప్పటికీ విద్యుత్‌ కోతలు తీవ్రంగా ఉన్నాయన్నారు. పంటలకు నీటి సరఫరా చేసే మోటార్లుకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో అవి పనిచేయకపోవడం, రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో దాదాపుగా పది ప్రాంతాల్లో జరిగాయ న్నారు. ఇక విద్యుత్‌ ఛార్జీలు ప్రజలు మోయలేని విధంగా భారంగా ఉన్నాయన్నారు. 3 నెలల్లో విద్యుత్‌ ఛార్జీలు రెటింపు అయ్యాయన్నారు. మూడు రకలా ఛార్జీలను ప్రభుత్వం వసూలు చేస్తుందన్నారు. విద్యుత్‌ కోతలను అరికట్టాలని, ఛార్జీలను తగ్గించాలన్నారు.
28న సదస్సులు
2000 సంవత్సరంలో బషీర్‌బాగ్‌ ప్రాంతంలో విద్యుత్‌ ఛార్జీల తగ్గించాలని చేస్తునన ఆందోళన కారులపై జరిగిన కాల్పుల నేపథ్యంలో సంస్మరణంగా ఈ నెల 28న వామపక్షాల ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు వి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి సెప్టెంబరు 4వ తేది వరకు దేశ వ్యాప్తంగా ధరల పెంపును వ్యతిరేకిస్తూ నిరుద్యోగ సమస్యపై సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిలువుదోపిడికీ వ్యతిరేకంగా సమరభేరీ మోగించాలని పిలుపు నిచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడుతూ సాగర్‌మాల పేరుతో, క్రిష్ణాపట్నం పోర్టుకు రహదారులు నిర్మించేందుకు జిల్లాలో భూములను కోల్పోయిన అనేక మంది రైతులున్నారన్నారు. భారత్‌మాల పేరుతో జిల్లాలోని తొమ్మిది మండలాల్లో,45 గ్రామాల్లో రైతాంగం 980 ఎకరాల భూమిని కోల్పోతున్నారన్నారు. వీరంతా చిన్నా,సన్నకారు రైతులు మాత్రమే అన్నారు. వారికి ప్రభుత్వం మార్కెట్‌ రేటుకు నాలుగు రెట్లు అధికంగా పరిహారం చెల్లించకుండా నామమాత్రంగా పరిహారం అందజేసి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అటువంటి రైతులందరిని ఐక్యపరిచి సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని , వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అందుకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తే సిపిఎం ఆందోళనకు సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల 30వ తేది నుంచి 4వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో ప్రజలు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.