Apr 23,2022 06:07
  • 'ఇజ్రాయిల్‌కు హాని చేయకూడదనుకునే 'నిశ్శబ్ద' పాలస్తీనియన్లూ ఉన్నారు. కీడు చేయాలనుకునే పాలస్తీనియన్లు ఉన్నారు. ఇజ్రాయిల్‌కు హాని కలిగించాలని కోరుకునే పాలస్తీనియన్లు ఉన్నారు. రెండో కోవకు చెందినవారికి వ్యతిరేకంగా మన శక్తులన్నిటినీ ఉపయోగిస్తామ'ని బెన్నెట్‌ అన్నాడు. ఈ విధానం మునుపటి ప్రధానమంత్రుల కంటే భిన్నమైన ఫలితాలను తీసుకురాకపోవచ్చు. హింస హింసను పుట్టిస్తుంది. ఇజ్రాయిల్‌-పాలస్తీనా వివాదానికి రాజకీయ పరిష్కారం చూపకుండా, హింసతో సహజీనం సాగించడం అత్యధిక ఇజ్రాయిలీయులకు అనివార్యమైన వాస్తవం.

పార్లమెంటులో తన ప్రభుత్వం మెజార్టీ కోల్పోవడంతో ఇజ్రాయిల్‌ ప్రధాని నఫ్తాలి బెన్నెట్‌ స్థితి బాగా బలహీన పడింది. బెన్నెట్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో మూడు రోజుల పర్యటనకు భారత్‌ రావాల్సి ఉంది. నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఆయన భారత్‌- ఇజ్రాయిల్‌ ద్వైపాక్షిక సంబంధాల 30వ వార్షికోత్సవాలకు హాజరవ్వాల్సి ఉంది. ఇంతలోనే ఆయన కోవిడ్‌-19 బారిన పడడంతో భారత పర్యటన వాయిదా పడింది. ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి హోదాలో బెన్నెట్‌ భారత్‌కు సమీప భవిష్యత్తులోనే కాదు, ఇక ఎప్పటికీ రాకపోవచ్చు. ఈ మధ్య చోటు చేసుకున్న రెండు తీవ్రమైన సంఘటనలు ఆయన ప్రభుత్వాన్ని తీవ్ర అనిశ్చితిలోకి నెట్టాయి. ఒకటి, బెన్నెట్‌ ప్రభుత్వం గత వారం పార్లమెంటులో మెజారిటీని కోల్పోవడం. రెండు, టెల్‌ అవీవ్‌లో ఏప్రిల్‌ 7న జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయిలీయులు చనిపోవడం. దీంతో ఇజ్రాయిల్‌లో హింస కొత్త దశకు చేరుకుంది. కాఫీ హౌస్‌ లో కూర్చున్నా, బార్లలో కూర్చొన్నా ఎప్పుడు ఎటువైపు నుంచి బులెట్లు దూసుకొస్తాయోనన్న భయం, వీధుల్లోకి వస్తే కత్తిపోట్లు భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఈ రెండు పరిణామాలలో ఏది ఆయన రాజకీయ జీవితానికి చరమగీతం పాడుతుందో చెప్పలేము.

  • ప్రభుత్వం పడిపోవచ్చు

బెన్నెట్‌ ప్రధాన మంత్రి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది. యామీనా పార్టీకి చెందిన ఎంపీ ఇదిత్‌ సిల్మాన్‌ (బెన్నెట్‌ స్వయంగా నాయకత్వం వహిస్తున్న మితవాద పార్టీ) ఏప్రిల్‌ 6న రాజీనామా బాంబు పేల్చారు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే సిల్మాన్‌ సంకీర్ణానికి విప్‌గా ఉన్నారు. అధికార పక్షం నుంచి ఎవరూ ఫిరాయించకుండా, ప్రతిపక్షాల ప్రలోభాలకు ఆకర్షితులు కాకుండా చూడాల్సిన ఆమే ఫిరాయించడంతో పాలక సంకీర్ణ కూటమి పతనపుటంచులకు చేరుకుంది.
బెన్నెట్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని యూదుల గుర్తింపునకు 'హాని' కలిగిస్తోందని, మితవాద శక్తులకు విధేయంగా లేదనేది సిల్మాన్‌ భావన. ఆ కారణంతోనే ఆమె ప్రభుత్వం నుంచి నిష్క్రమించారు . సిల్మాన్‌ ఫిరాయింపు తరువాత 120 మంది సభ్యులున్న పార్లమెంటులో బెన్నెట్‌ బలం 60కి పడిపోయింది. సంకీర్ణం నుండి మరొక్క సభ్యుడు నిష్క్రమిస్తే ప్రభుత్వం పడిపోవడం ఖాయం. బెన్నెట్‌ ప్రధానమంత్రి అయినప్పుడు, ఆయనకు 61 మంది సభ్యుల మద్దతు ఉంది. కనీస ఉమ్మడి కార్యక్రమం కానీ, రాజకీయ ఏకాభిప్రాయం కానీ లేని తొమ్మిది పరస్పర విరుద్ధ రాజకీయ పార్టీలు బెంజిమిన్‌ నెతన్యాహును ఎట్టి పరిస్థితుల్లోను అధికారం దక్కనీయరాదన్న ఉద్దేశంతోనే చేతులు కలిపాయి.ఈ కూటమి ఎప్పుడైనా పుటుక్కుమనవచ్చు. మళ్లీ పార్లమెంటు ఎన్నికలు రావచ్చు.
ఇజ్రాయిల్‌ ప్రజల ప్రయోజనాల కోసం పాలనా, నిర్వహణ సుస్థిరతకు ప్రాథమికంగా కట్టుబడి ఉండేందుకు వామపక్ష, మితవాద, మధ్యేవాద పార్టీలు కీలకమైన తమ సైద్ధాంతిక సూత్రాలను కొంత మేర సడలించుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రెండేళ్లలో నాలుగు సార్లు జాతీయ ఎన్నికలు జరిగినా ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అవి ఈ అవగాహనకు వచ్చాయి. సిల్మాన్‌ ఫిరాయింపు ఐక్యతా ప్రభుత్వం ఎదుర్కొంటున్న మొదటి అతి పెద్ద సంక్షోభం. ఆసక్తికరమైన అంశమేమిటంటే ఆమె పార్టీలోని ఇతర ఎంపీలెవరూ ఆమెను అనుసరించకపోవడం. ఆమె ఫిరాయింపుతో ఏర్పడిన నష్టాన్ని అరికట్టేందుకు బెన్నెట్‌కు ఇది కొంతమేర అవకాశమిచ్చింది. అయినా, మెజారిటీ కొరవడిన కారణంగా ప్రధానిగా ఆయన ఇప్పుడు బలహీనంగా ఉన్నారు. ఏ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించుకోగలిగే స్థితిలో లేరు.

  • భద్రతకు పొంచి ఉన్న ముప్పు

యిస్ట్‌ బ్యాంక్‌ ఇతర ఇజ్రాయెల్‌ నగరాలకు చెందిన సాధారణ పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కాంక్షతో రగులుతున్నారు. సరైన అవకాశం కోసం వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మహ్మద్‌ అబ్బాస్‌ నాయకత్వం అవినీతికరంగా తయారవడంతో పాలస్తీనా విమోచనా ఉద్యమం చెదిరిపోయింది. దీంతో హమాస్‌ రాకెట్ల దాడులను ఇజ్రాయిల్‌ సులువుగానే ఎదుర్కోగలుగుతోంది. దీంతో నైరాశ్యానికి గురైన పాలస్తీనా యువకులు తమ అంతిమ లక్ష్యమైన స్వతంత్ర పాలస్తీనా కోసం దేనికైనా తెగించేందుకు సిద్ధమవుతున్నారు.. మూడు వారాల వ్యవధిలో నాలుగుసార్లు దాడులకు దిగారు. ఈ దాడుల్లో 11 మంది చనిపోయారు. ఇంకా అనేకమంది గాయపడ్డాయి. ఏప్రిల్‌ 7న టెల్‌ అవీవ్‌ లోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక బార్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు, 13 మంది గాయపడ్డారు. దీంతో యూదు దురహంకార ఇజ్రాయిల్‌ సైన్యం మరింతగా రెచ్చి పోయి జెరూసలెంలోని చారిత్రిక అల్‌ అక్సా మసీదుపై దాడులకు తెగబడింది. పాలస్తీనీయులపై అణచివేతను ఎంత తీవ్రంగా అమలు చేస్తే అంత సమర్థుడైన పాలకుడుగా ఇజ్రాయిల్‌ పాలకవర్గాలు, వాటి అధీనంలోని మీడియా పరిగణిస్తాయి. పాలస్తీనీయులను ఊచకోత కోసిన పాపాల భైరవుడు బెంజిమిన్‌ నెతన్యాహు అందరికన్నా ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగాడు. అతడ్ని మిస్టర్‌ సెక్యూరిటీ అని పిలుస్తారు. భద్రత అనేది చాలా సున్నితమైన సమస్య. ఇది మిస్టర్‌ బెన్నెట్‌ ఇది నేడు పెద్ద సవాల్‌గా పరిణమించింది. ఒక వైపు తన ప్రభుత్వం పడిపోకుండా చూసుకుంటూ, మరో వైపు భద్రతకు సంబంధించిన సవాల్‌ను ఎదుర్కోవాలి.
పెరుగుతున్న దాడులను ఎదుర్కోవడంపై బెన్నెట్‌ దృష్టి సారిస్తున్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న నెతన్యాహు కన్నా తాను మెరుగు అని చాటుకోవాలని చూస్తున్నాడు. పరిస్థితిపై తనకు పూర్తి పట్టు ఉందని, ఉగ్రవాద బీభత్స ఇజ్రాయిలీయులదే విజయమని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిలో భాగంగానే గత వారాంతంలో దాడి జరిగిన టెల్‌ అవీవ్‌ లోని బార్‌ను బెన్నెట్‌ సందర్శించాడు. 'ఒప్పించడం, దారికి రాకుంటే శిక్షించడం' (క్యారెట్‌ మరియు స్టిక్‌ పాలసీ) ఇదే తన విధానమని, ఇజ్రాయిల్‌కు ఈ విధానం సహాయపడగలదనే తాను భావిస్తున్నానని బెన్నెట్‌ ఒక ఇంటర్వ్యూలో వివరించాడు.
'ఇజ్రాయిల్‌ కు హాని చేయకూడదనుకునే 'నిశ్శబ్ద' పాలస్తీనియన్లూ ఉన్నారు. కీడు చేయాలనుకునే పాలస్తీనియన్లు ఉన్నారు. ఇజ్రాయిల్‌ కు హాని కలిగించాలని కోరుకునే పాలస్తీనియన్లు ఉన్నారు. రెండో కోవకు చెందినవారికి వ్యతిరేకంగా మన శక్తులన్నిటినీ ఉపయోగిస్తామ'ని బెన్నెట్‌ అన్నాడు. ఈ విధానం మునుపటి ప్రధానమంత్రుల కంటే భిన్నమైన ఫలితాలను తీసుకురాకపోవచ్చు. హింస హింసను పుట్టిస్తుంది. ఇజ్రాయిల్‌ -పాలస్తీనా వివాదానికి రాజకీయ పరిష్కారం చూపకుండా, హింసతో సహజీనం సాగించడం అత్యధిక ఇజ్రాయిలీయులకు అనివార్యమైన వాస్తవం.
ఈ రెండు పరిణామాల దష్ట్యా, మిస్టర్‌ బెన్నెట్‌ త్వరలో భారతదేశాన్ని సందర్శించే అవకాశాలు చాలా తక్కువ. బెన్నెట్‌ పర్యటన వాయిదా పడడానికి ఏప్రిల్‌ 1న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ భారత్‌లో పర్యటించినందున, ఆ సమయంలో ఇజ్రాయిల్‌ ప్రధాని భారత పర్యటనపై అమెరికా అంత సంతోషంగా లేదనేది ఒక వాదన. ఇజ్రాయిల్‌ ప్రధాని భారత్‌ పర్యటించకుండా చూడడంలో అమెరికా కొంత ప్రభావం చూపి ఉండొచ్చు. ఇది ఊహాజనితమే అయినా, అలా జరిగే అవకాశం మాత్రం ఉంది.

సంక్షోభంలో నఫ్తాలి బెన్నెట్‌
- డా|| ఖిన్వ్‌రాజ్‌ జాంగిడ్‌

(రచయిత సెంటర్‌ ఫర్‌ ఇజ్రాయెల్‌ స్టడీస్‌లో ఆచార్యులు)