Aug 20,2020 10:20

కోవిడ్‌ 19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితులలో ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి చైనా నాయకత్వం వహిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో చైనా జిడిపి 3.2 శాతం పెరిగింది. కోవిడ్‌-19 మహమ్మారిని కట్టడి చేయలేక, ఆర్థికాభివృద్ధి పతనాన్ని అరికట్టలేక ఆర్థికంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు సతమతమౌతుంటే చైనా మహమ్మారిని జయప్రదంగా కట్టడి చేయటంతో పాటు జిడిపి పెరుగుదలను కూడా సాధించింది. చైనా ఎలా సాధించిందో పరిశీలించి, పాఠాలను నేర్చుకోవటం మన దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది.
అభివృద్ధికి చైనా ప్రణాళిక
కరోనా వైరస్‌ తమ దేశంతో పాటు ప్రపంచ వ్యాపితంగా విస్తరించటంతో అందుకనుగుణంగా చైనా తమ అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించుకుంది. అన్ని దేశాలు లాక్‌డౌన్‌లు ప్రకటించటంతో ఆ దేశాలలో ఉద్యోగాలు, ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటంతో తమ ఎగుమతులు తగ్గుతాయని అంచనా వేసింది. ఎగుమతుల తగ్గుదల వలన సంభవించే ఉత్పత్తి మాంద్యాన్ని అధిగమించటం కోసం తమ ప్రజల కొనుగోలు శక్తిని పెంచటానికి చర్యలు తీసుకుంది. ప్రజల ఉద్యోగాలు, కొనుగోలు శక్తిని కాపాడటం కోసం చైనా తమ దేశ చరిత్ర లోనే అతి పెద్ద ఆర్థిక ప్యాకేజిని ప్రకటించింది. 2008లో అమెరికాలో గృహ రుణాలతో ప్రారంభమైన సంక్షోభం అన్ని రంగాలను, ప్రపంచ దేశాలను చుట్టుముడుతున్న సమయంలో చైనా 4 లక్షల యువాన్ల్ల (రూ.45 లక్షల కోట్లు) ప్యాకేజీని ప్రకటించింది. ఆనాటికన్నా అదనంగా, తమ దేశ చరిత్ర లోనే అత్యధికంగా ప్రస్తుతం మొత్తం 6 లక్షల కోట్ల యువాన్లను (రూ.66 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నది. ఏప్రిల్‌లో 4 లక్షల యువాన్ల (559 బిలియన్‌ డాలర్లు) ప్యాకేజీని ప్రకటించింది. తీవ్ర చిక్కుల్లో ఉన్న పరిశ్రమలను, వ్యాపారులను ఆదుకోవటం, తద్వారా ఉత్పత్తిని, ఉద్యోగాలను రక్షించటానికి కృషి చేస్తున్నది. ప్రభుత్వ బాండ్లను విడుదల చేయటం ద్వారా ప్రాంతీయ ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఖర్చు చేస్తున్న రెండు లక్షల కోట్ల యువాన్లకు ఇది అదనం. మొదటి త్రైమాసికంలో 6.8 శాతం కుచించుకుపోయిన జిడిపి...ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రెండవ త్రైమాసికంలో తిరిగి పెరుగుదలను సాధించింది. 2020లో చైనా జిడిపి పెరుగుదల 1.2 శాతానికి పరిమితం అవుతుందని మొదట్లో ఐఎంఎఫ్‌ ప్రకటించింది. అనేక ఇతర సంస్థలు కూడా చైనా జిడిపి పెరుగుదల 1.5 నుండి 2.5 శాతం మధ్య ఉంటుందని అంచనాలు వేశాయి. ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ రెండవ త్రైమాసికంలో చైనా జిడిపి 3.2 శాతానికి పెరిగింది. గత సంవత్సరం 6.1 శాతం జిడిపి వృద్ధిని సాధించిన చైనా జిడిపి ఈ సంవత్సరం 5 శాతం పెరగవచ్చునని ఇపుడు అన్ని సంస్థలూ అంచనాలు వేస్తున్నాయి. 90 కోట్ల మంది శ్రామికులు ఉన్న చైనాలో శ్రామికులందరికీ పని కల్పించకపోతే వారు ఆకలితో ఉంటారని, పని కల్పిస్తే సంపదను ఉత్పత్తి చేస్తారనే అవగాహనతో చైనా నాయకత్వం పనిచేస్తున్నది. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌బిఎస్‌) విడుదల చేసిన లెక్కల ప్రకారం సంవత్సరం మొదటి అర్ధభాగంలో జిడిపి 45.66 లక్షల కోట్ల యువాన్లు (6.53 లక్షల కోట్ల డాలర్లు) గత సంవత్సరంతో పోలిస్తే 1.6 శాతం తక్కువగా ఉన్నది. వైరస్‌ వలన ఎదురైన ప్రతికూలతను ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే అధిగమించామని, తర్వాతి ఆరు మాసాల కాలంలో అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని చైనా ఆర్థికవేత్తలు ప్రకటించారు. రెండవ త్రైమాసికంలో 4.4 శాతం పారిశ్రామికాభివృద్ధిని, సేవా రంగంలో 1.9 శాతం వృద్ధిని సాధించారు. చిల్లర వర్తకం 15.1 శాతం పెరిగింది. పారిశ్రామిక, సేవారంగాలలో మూడు మాసాల పాటు వరుసగా అభివృద్ధిని సాధించటంతో పాటు ఎగుమతుల్లోనూ పెరుగుదలను సాధించారు. అభివృద్ధిని పట్టాలెక్కించటంతో ప్రజలకు జీవనోపాధిని మెరుగుపరచటం, కొత్తగా ఉద్యోగాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నారు. మహమ్మారి కారణంగా చిన్న, మధ్య తరహా కంపెనీలు పొందిన నష్టాన్ని భర్తీ చేసి, ఉద్యోగాలను నిలబెట్టటం కోసం అనేక రాయితీలు, సబ్సిడీలను ప్రభుత్వం అందించింది. ఈ సంవత్సరం మొదటి ఆరు మాసాల కాలంలో 56.4 లక్షల మందికి నూతనంగా ఉపాధిని కల్పించారు. సంవత్సరం మొత్తానికి నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇది 62.7 శాతం. పట్టణాలలో నిరుద్యోగంపై చేసిన సర్వేలో నిరుద్యోగం వరుసగా రెండు మాసాలలో 5.7 శాతానికి తగ్గిందని స్పష్టమైంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే వినియోగదారుల ధరల పెరుగుదల 3.8 శాతంగా ఉంది. మొదటి త్రైమాసికం కన్నా ఇది 1.1 శాతం తక్కువ. దేశీయ వినియోగాన్ని పెంచటానికి, దరిద్రాన్ని తగ్గించటానికి తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పేద ప్రజలు ఎక్కువగా ఉన్న సిచువాన్‌, గ్విజౌ, గ్వాంగ్జిలలో గ్రామీణ ప్రజల తలసరి ఆదాయం 5.5 నుండి 7.6 శాతం వరకు పెరిగింది. సామాజిక సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయటం వలన వృద్ధాప్య, రిటైర్‌మెంటు పెన్షన్లు 9.3 శాతం, సంక్షేమ గ్రాంట్లు, సబ్సిడీలు 13.2 శాతం పెరిగాయి. ప్రపంచమంతా మాంద్యం లోకి జారుకుంటున్న కాలంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డేటా, కృత్రిమ మేధ తదితర నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. డిజిటల్‌ ఎకానమీ, స్మార్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌, లైఫ్‌ అండ్‌ హెల్త్‌ తదితర నూతన రంగాలు అభివృద్ధిలో ముందున్నాయి. ఇ-కామర్స్‌ వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలు వరుసగా 32.0, 21.8 శాతం చొప్పున అభివృద్ధి చెందాయి. ఆరోగ్య, ఆర్థిక రంగాలలో ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకొంటే మహమ్మారిని అదుపు చేయటం, దేశీయంగా, అంతర్జాతీయంగా సంభవిస్తున్న ఒడిదుడుకులను ఎదుర్కొని ఆర్థికాభివృద్ధిని సాధించటం సాధ్యమేనని చైనా అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.
మోడీ పభుత్వ బాధ్యతారాహిత్యం
చైనా వ్యవహరిస్తున్న తీరుకు పూర్తి విరుద్ధంగా భారత ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. ఫలితంగా దేశంలో కోవిడ్‌ 19 మహమ్మారి విజృంభించటంతో పాటు, జిడిపి పెరుగుదల కూడా దిగజారుతున్నది. కోవిడ్‌-19 మహమ్మారిని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడటం, ఆర్థిక మాంద్యాన్ని పరిష్కరించే చర్యలు తీసుకోవటానికి బదులుగా ప్రభుత్వం ప్రయోజనం లేని చర్యలు, పథకాలను ప్రకటిస్తున్నది. ఫలితంగా 500లకు పైగా కేసులతో మార్చి 23వ తేదీన లాక్‌డౌన్‌ ప్రకటించిన మన దేశంలో ఆగస్టు 17 తేదీ నాటికి కేసులు 27 లక్షలు, మరణాలు 50 వేలు దాటిపోయాయి. కోవిడ్‌ను అరికట్టటం పేరుతో హఠాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రభుత్వం వైరస్‌ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయటం, రోగులను గుర్తించటం, వైద్యం అందించటం, అనుమానితులను ఐసొలేషన్‌లో ఉంచటం తదితర చర్యలు తీసుకోవటానికి మారుగా లైట్లు ఆపివేయటం, చప్పట్లు చరచటం, వైద్య సిబ్బందిపై పూలు చల్లటం, నౌకలపై లైట్లు వెలిగించటం తదితర హాస్యాస్పదమైన చర్యలు తీసుకుంది. ఫలితంగా ఈ రోజు వైరస్‌ సోకినవారి సంఖ్యలో ప్రపంచంలో మూడవ స్థానం, మరణించిన వారిలో నాలుగవ స్థానానికి చేరుకున్నది. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుంది.
ఆర్థిక రంగంలో కూడా ఇదే విధమైన విధానాలను అనుసరిస్తున్నది. ఉద్యోగాలను కాపాడటం, ప్రజలకు ఉపాధి కల్పించే అంశాలను పక్కనపెట్టి, బహుళజాతి సంస్థలు, బడా కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టే విధానాలను అనుసరిస్తున్నది. కోవిడ్‌-19 మహమ్మారి, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవటం కోసం అంటూ ప్రకటించిన రూ.20.79 లక్షల కోట్ల ప్యాకేజీ వాస్తవవానికి రూ.1.5 లక్షల కోట్లకు మించదు. ఆదాయం పన్ను చెల్లించని 80 శాతం ప్రజలకు నెలకు తలకు 10 కిలోల ఆహార ధాన్యాలు, కుటుంబానికి 7,500 రూపాయల చొప్పున ఆరు మాసాల పాటు అందించాలన్న నిపుణుల సూచనలను పట్టించుకోవటం లేదు. లాక్‌డౌన్‌ వలన ప్రజలు పెద్దసంఖ్యలో కదిలి ఆందోళనలు చేయటం సాధ్యం కాని పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ దిగజారుస్తున్నది. కార్మికుల పని గంటలను 8 నుండి 12కు పెంచుతూ ఆర్డినెన్స్‌ను జారిచేసింది.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వేగవంతం చేసింది. కార్పొరేట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన లక్ష కోట్ల రూపాయలకు పైగా రుణాలను రద్దు చేసింది. ఈ విధానాల ఫలితంగా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జిడిజి రెండంకెలు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జిడిపి 3-4 శాతం తగ్గవచ్చని మొదట అంచనా వేయగా ఇపుడు 7 శాతం తగ్గుతుందని అంచనాలు వేస్తున్నారు. ప్రభుత్వం ఇదే విధానాలను కొనసాగిస్తే జిడిపి 10 శాతానికి మించి తగ్గినా ఆశ్చర్యం లేదు. సంక్షోభ కాలంలో చైనా, భారత ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను పరిశీలిస్తే రెండింటి మధ్య వ్యత్యాసం స్పష్టమౌతుంది. తమ దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ప్రధానంగా చైనా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంటే, కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలకు లాభాలు పెంచటం లక్ష్యంగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలతో ఆర్థిక మాంద్యం తీవ్రం కావటంతో పాటు దేశం ఆరోగ్య సంక్షోభంలో కూరుకుపోయి, నివారించదగిన వైరస్‌కు లక్షలాది మంది అమాయక ప్రజలు బలైపోయే పరిస్థితి ఏర్పడుతున్నది.
                                                                                                                                                                       * ఎ. కోటిరెడ్డి