Aug 22,2023 22:49

కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన శ్రీనివాసరావు

* ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాసరావు
ప్రజాశక్తి - ఎచ్చెర్ల, పలాస: 
పాలనలో సంస్కరణలు, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. ఎచ్చెర్లలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం అనులు చేసేందుకు సిద్ధమైందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్న కేరళ ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థనే తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారే తమ పిల్లలను అంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారని చెప్పారు. విద్య, వైద్యానికి కీ.శే రాజశేఖర్‌ రెడ్డి ప్రాధాన్యత కల్పించారని, నేడు జగన్మోహన్‌ రెడ్డి మరింత బలోపేతం చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. తీర ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు.
వైఎస్‌ఆర్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం ఫౌండర్‌ కార్యదర్శి జి.శాంతమూర్తి మాట్లాడుతూ మానవతా దృక్పథం లేకపోతే టెక్నాలజీ వృథా అని అన్నారు. నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ఉప కులపతి వి.బాల మోహన్‌దాస్‌, బి.ఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఎన్‌.వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రా యానివర్సిటీ ప్రొఫెసర్‌ తిమ్మారెడ్డి, పాతపట్నం, టెక్కలి, రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు కె.శ్రీరాములు, గోవిందమ్మ, స్వప్న హైందవి, గాయత్రి విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌ పులఖండం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కిడ్నీ వ్యాధి మూలాలు కనుగొనడమే ప్రభుత్వ లక్ష్యం
ఉద్దానంలో మహమ్మరిలా వ్యాపిస్తున్న కిడ్నీ వ్యాధి మూలాలు కనుగొనడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. కాశీబుగ్గలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆసుపత్రిని మంగళవారం సందర్శించారు. కిడ్నీ రోగులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. అంతకుముందు పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు.