ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వీరికి గత 5 నెలలుగా కాస్మొటిక్ ఛార్జీలను పెండింగ్‌లో ఉంచారు. అధికారులు బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. హాస్టల్ పిల్లలకు సబ్బు, కొబ్బరినూనె కరువయిందని చెబుతున్నారు. కాకినాడ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 22 పోస్ట్ మెట్రిక్, 12 ప్రి మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 4 వేల మంది పిల్లలు ఏటా చేరుతున్నారు. బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 17 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 1058 మంది, 23 ప్రి మెట్రిక్ హాస్టళ్లలో 1048 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.
5 నెలలుగా పెండింగ్
జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు 5 నెలలుగా కాస్మొటిక్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. 3వ తరగతి నుంచి 6 వరకు బాలురకు నెలకు రూ.175, ఏడవ తరగతి నుంచి 10 వరకూ రూ.200, మూడో తరగతి నుంచి 6 వరకూ బాలికలకు రూ.130, ఏడో తరగతి నుంచి 10 వరకు రూ.200, ఇంటర్ ఆపై బాలురు, బాలికలకు రూ.250 చెల్లిస్తున్నారు. ఎస్‌సి వసతి గృహ విద్యార్థులకు 5 నెలలకు రూ.35 లక్షల పైన, బీసీ విధ్యర్డులకు రూ.21 లక్షలు పైనే పెండింగ్ ఉన్నాయి.
కేటాయించని బడ్జెట్
ప్రభుత్వం విడుదల చేసే కాస్మోటిక్ ఛార్జీలు నేరుగా విద్యార్థులకే అందించాలని భావించిన ప్రభుత్వం వారి తల్లుల ఖాతాల్లో ప్రతి ఏడాదీ సొమ్ము జమ చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కాస్మొటిక్ ఛార్జీలు అందడం లేదు. ప్రతి నెలా సంక్షేమ అధికారులు బిల్లులు అప్లోడ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడంతో తల్లిదండ్రుల ఖాతాల్లో సొమ్ములు జమ కావడం లేదు. ఈ నెలలో కూడా సిఎంఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో చూపుతోంది.
పెరుగుతున్న ధరలు, సరిపోని కాస్మోటిక్ చార్జీలు
కాస్మోటిక్ ఛార్జీల బిల్లులు ఎప్పటికప్పుడు అందించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం ఎక్కడికక్కడ విపరీతంగా ధరలు పెరిగిపోయాయి. క్షౌరం చేసుకోవాలంటే కనీసం రూ.100 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. సబ్బులు, నూనెల ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఇస్తున్న అరకొర సొమ్ములు ఏ మూలకు సరిపోతాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీంతో సొంత డబ్బులతో క్షౌరాలు చేయించుకొంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఇచ్చే డబ్బులు కూడా నెలలు తరబడి పెండింగ్‌లో ఉంచడంతో ఇబ్బందులు పడుతున్నారు.










