Aug 12,2023 23:21

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి పప్పులు, ఆయిల్‌, పోపులతో బాటు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సంక్షేమ వసతి గహాల విద్యార్థులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అండడం లేదు. ప్రభుత్వం చాలీచాలని డైట్‌ చార్జీలను ఇస్తుండగా మెనూ అమలు చేయడం కష్టంగా మారిందని వార్డెన్లు గగ్గోలు పెడుతున్నారు. అప్పులు చేసి ఆహారం అందించాల్సి వస్తోందని వాపోతున్నారు. దానికి తోడు గత 5 నెలలుగా డైట్‌ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కాకినాడ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 22 పోస్ట్‌ మెట్రిక్‌,12 ప్రి మెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 4 వేల మంది పిల్లలు ఏటా చేరుతున్నారు. బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 17 పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లలో 1058 మంది, 23 ప్రి మెట్రిక్‌ హాస్టళ్లలో 1048 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.
సరిపోని డైట్‌ చార్జీలు
వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే మూడు, నాలుగో తరగతి విద్యార్థుల కోసం గతంలో నెలకు ఒక్కొక్కరికీ రూ.1000 (రోజుకి రూ.33) డైట్‌ ఛార్జీ ఇస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి 20న రూ.1,150కు (రోజుకి రూ.38) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఐదు, పదో తరగతి చదువుకునే వారి ఛార్జీలను రూ.1,250 (రోజుకి రూ.42) నుంచి రూ.1,400 (రోజుకి రూ.47)గా చేశారు. ఇంటర్‌, ఆపై విద్యార్థులకు రూ.1,400 నుంచి రూ.1,600 (రోజుకి రూ.53)కు పెంచారు. జూన్‌ 1 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం చెప్పినా ఛార్జీలు పెరగలేదు. వీటి ప్రకారం విద్యార్థులకు రోజూ ఉదయం టిఫిన్‌, సాయంత్రం స్నాక్స్‌, రాత్రి భోజనం, సెలవు రోజుల్లో మధ్యాహ్నా భోజనం కలిపి ఒక్కొక్కరికీ ప్రభుత్వం ఈ మొత్తం మాత్రమే అందజేస్తున్నది.
అయితే బయట మార్కెట్‌లో భోజనం చేయాలంటే రూ.100 తక్కువ లేదు. టిఫిన్‌ తినాలన్నా రూ.40 ఖర్చు అవుతోంది. ఈ పరిస్థితుల్లో రూ.38 నుంచి రూ.53 ఇస్తున్నందున ఏ మేరకు మెనూ ఛార్జీలను అమలు చేయాలని వార్డెన్లు వాపోతున్నారు. ప్రస్తుతం కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. టమోటా కిలో రూ.170, పచ్చిమిర్చి రూ.120, ఇతర కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. కందిపప్పు రూ.150, ఆయిల్‌ రూ.100 నుంచి రూ.160 అమ్ముతున్నారు. ఇలా అన్ని ధరలు గతంతో పోల్చుకుంటే బాగా పెరిగాయి.
బిల్లులు అందక అవస్థలు
మెనూ బిల్లులు గత 5 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో వార్డెన్లు సతమతమవుతున్నారు. కాకినాడ ఐడియల్‌ కళాశాల వద్ద ఉన్న బిసి కాలేజీ వసతి గృహంలో సుమారు 100 మంది విద్యార్థులు ఉంటున్నారు. నెలకు రూ.1.60 లక్షలు డైట్‌ ఛార్జీలు ఖర్చు అవుతున్నాయి. ఇక్కడ 5 నెలల డైట్‌ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ హాస్టల్‌కు రూ.8 లక్షలు పెండింగ్‌ ఉండడంతో అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వార్డెన్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో ఈ డైట్‌ ఛార్జీలు ఏ మాత్రం సరిపోవడం లేదని ఒక్కో విద్యార్థికి కనీసం రూ.2 వేలు ఇవ్వాలని కోరుతున్నారు. పిఠాపురం ఎస్‌సి బాలికల వసతి గృహంలో 150 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఇక్కడ గతేడాది డిసెంబర్‌ నుంచి డైట్‌ ఛార్జీలు అండడం లేదు. పాలు, గుడ్లు, కూరగాయలు సరఫరా చేస్తున్న వెండర్లకు మధ్యలో సెలవులు మినహా 7 నెలలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సకాలంలో బిల్లులు అందక వెండర్లు తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని వార్డెన్‌ కామేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో పోల్చితే నిర్వహణ కష్టంగా మారిందని, పిల్లలకు సరైన పౌష్టికాహారం పెట్టాలంటే కుదరడం లేదని పలువురు వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పులు, పప్పులు, నూనె, గుడ్డు, చికెన్‌, గ్యాస్‌ ఇలా అన్ని ధరలు విపరీతంగా పెరిగాయని దీంతో ప్రభుత్వం ప్రకటించిన మెనూ అమలు చేయడం కష్టంగా మారిందని, ప్రభుత్వం డైట్‌ ఛార్జీలు పెంచాలని కోరుతున్నారు.