Aug 14,2023 21:40

బుక్‌లెట్‌ను అందజేస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి - పాచిపెంట :  ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సిఎం పి.రాజన్న దొర అన్నారు. మండలంలోని కొటికిపెంట పంచాయతీ గోగాడవలస, చండివలస గ్రామాల్లో సోమవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధిని లబ్ధిదారులకు వివరించారు. అలాగే గ్రామాల్లో సమస్యలుంటే తెలియజేయాలని కోరారు. చండివలసలో శ్మశాన వాటికకు రహదారి నిర్మించాలని, లో వోల్టేజ్‌ సమస్య పట్టిపీడిస్తుందని ఈ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించి ఆయన సంబంధిత అధికారులను పిలిచి రెండు సమస్యలు త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
టిడిపి తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
అనంతరం గోగాడవలసలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం ౖ కొంతమంది టిడిపి కార్యకర్తలు సామాజిక మాధ్యమాలల్లో అసత్య ప్రచారాలు, ట్రోల్‌ చేస్తున్నారని అటువంటి వారిపై అట్రాసిటీ, క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. కొటికిపెంట గ్రామస్తులకు ఇళ్ల నిర్మాణాల కోసం ఎన్నికల సమయంలో రూ.5లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు టిడిపి కార్యకర్తలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తాను ఎప్పుడూ ఇలాంటి హామీ ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1,80,000 మంజూరు చేస్తుందని, రూ.2,80,000 ఇస్తే బాగుంటుందని నాయకుల కోరిక మేరకు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి రాసి పెట్టానని, రూ.5 లక్షలు మంజూరు చేస్తానని తానెక్కడా అనలేదని తెలిపారు. ఎన్నికల ముందు టిడిపి నాయకులు సాగునీటి ప్రాజెక్టులు పరిశీలించడం ఎంతవరకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు. పెద్దగెడ్డ, వెంగళ రాయ సాగర్‌, ఆండ్ర జలాశయాల ద్వారా రెండు పంటలకు నీరు ఇవ్వాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేస్తున్నారని, సాగునీటి ప్రాజెక్టులపై అసలు వారికి అవగాహన ఉందా ఈ మూడు ప్రాజెక్టులు ఒక్క ఖరీఫ్‌ సాగుకే నీరు అందేలా డిజైన్‌ చేశారని రెండో పంట ఆరుతడి పంటలకు సాగునీరందించడం జరుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎంపిపి బి.ప్రమీల, వైసిపి నాయకులు ఇజ్జాడ అప్పలనాయుడు, దండి ఏడుకొండలు, డోల బాబ్జీ, పి.వీరమనాయుడు, తిరుపతి, టి.గౌరీశ్వరరావు, ఎంపిడిఒ జి.పార్వతి, ఎఒ తిరుపతిరావు, పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.