వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త వైవి.సుబ్బారెడ్డి
ప్రజాశక్తి- సీతమ్మధార : గడపగడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరింత చేరువై, వారి సమస్యలను పరిష్కరించి, సంక్షేమ పథకాలను అందించడం ద్వారా విశేష ప్రజాదరణతో మరిన్ని సీట్లు గెలుపొందవచ్చని వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ కన్వీనర్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. గురువారం 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త నెట్‌క్యాప్ చైర్మన్ కెకె.రాజు ఆధ్వర్యంలో గడపగడపకు ప్రభుత్వంలో భాగంగా ఇంటింటికి వెళ్లారు. సంక్షేమ పథకాలను వివరించి, సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గడపగడపకూ ఎంత ఎక్కువ తిరిగితే, అన్ని సీట్లు పెరుగుతాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని నాలుగు సీట్లు కోల్పోయినా, తరువాత జరిగిన జివిఎంసి ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గంలో 17 వార్డులకు గాను15 గెలుచుకున్నామని, రానున్న ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గంలోనూ వైసిపి అఖండ విజయం సాధిస్తుందనిజోస్యం చెప్పారు.
పాలనా వికేంద్రీకరణతో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తుంటే, ప్రతిపక్షాలు స్వలాభం కోసం అడ్డుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి రాజధాని నిర్మించే కన్నా, ఆ మొత్తాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగిస్తే బాగుంటుందనిఅభిప్రాయపడ్డారు. రైతుల పాదయాత్రలో ఆకుపచ్చ చొక్కాల వెనక పచ్చ చొక్కాలు ఉన్నాయని, ఉత్తరాంధ్రకు దండయాత్రగా వస్తున్న వారికి కళ్లు తెరుచుకునేలా బుద్ధి చెప్పాలని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజును ఉద్దేశించి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎవరికి ఏ సమస్య వచ్చినా సత్వరమే పరిష్కరిస్తున్నారని, అవసరమైతే తన సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కెకె.రాజును ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో చొక్కాకుల వెంకటరావు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్స్, వైసిపి శ్రేణులు పాల్గొన్నారు










