
ప్రజాశక్తి - భట్టిప్రోలు
దేశంలోనే సంక్షేమ పాలన అందిస్తున్న ఏకైక రాష్ట్రం, సిఎం జగన్మోహన్ రెడ్డి అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున అన్నారు. సంక్షేమ పాలన కోసం ఆయనను మళ్లీ సిఎంగా గెలిపించుకోవాలని కోరారు. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో ఆంధ్రప్రదేశ్లో జగనే ఎందుకు కావాలి? అనే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. సభకు మార్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. అన్ని సామాజిక వర్గాలకు అవసరమైన సంక్షేమ పథకాలను అడగకుండానే ఇస్తున్న జగన్‌ను మళ్లీ గెలిపించాలని కోరారు. చేతి వృత్తుల వారికి సంక్షేమ పథకాలు అందిస్తూ ఆర్థికంగా చేయూత నందిస్తూ బలోపేతం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ఏది అవసరమో దానిని ముందుగానే గుర్తించి అమలు చేస్తున్న జగన్ పట్ల ప్రజలు విశ్వాసం కలిగి ఉన్నారని అన్నారు. ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే విధంగా చేశారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ డివి లలిత కుమారి, జడ్పిటిసి టి ఉదయభాస్కరి, మండల అధ్యక్షులు కె పిచ్చయ్య శాస్త్రి, సర్పంచ్ ధార రవికిరణ్మయి, మహిళా నాయకురాలు గాలి అరవింద, సొసైటీ చైర్ పర్సన్లు చిన్న బుజ్జి, గుమ్మడి సాంబశివరావు, నాయకులు మల్లేశ్వరరావు, చెన్నయ్య, బాలాజీ పాల్గొన్నారు.