
ప్రజాశక్తి పాడేరు:- అట్టడుగు వర్గాల అభివద్ధి కోసం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.రాజన్నదొర తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర సోమవారం పాడేరులో నిర్వహించారు. ఈ సందర్భంగా పాడేరు మెయిన్ రోడ్‌లో ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అభివృద్ధి కోసం రూ, 17వేల 134 కోట్లు ప్రత్యక్షంగా పరోక్షంగా ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి ఆంధ్ర విద్యాబోధన విద్యా వైద్య మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గిరిజనుల అభివృద్ధి పథకాల కోసం ప్రభుత్వం గత ఐదేళ్లలో 20 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, గిరిజనుల విద్య, ఆరోగ్యం పట్ల సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని, ఇచ్చిన హామీ మేరకు పాడేరులో 500 కోట్లతో మెడికల్ కళాశాలను నిర్మించడం విశేషమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు పసుపులేటి బాలరాజు, అరకు ఎంపీ జి.మాధవి, జడ్పీ చైర్మన్ సుభద్ర, ఎమ్మెల్సీ రవిబాబు, అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గణ, వైయస్సార్సీపి ఎస్టి సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు మత్స్యరాస వెంకటలక్ష్మి, జీసీసీ చైర్ పర్సన్ శోభా స్వాతి రాణి, నియోజక వర్గంలోని వివిధ మండలాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.