- మంత్రి కాకాని గోవర్థనరెడ్డి
- జగ్గయ్యపేట మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం
ప్రజాశక్తి - జగ్గయ్యపేట : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జగ్గయ్యపేటలోని మార్కెట్ యార్డ్‌లో సోమవారం రాత్రి జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి గోవర్థనరెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా చిల్లకల్లు గ్రామ సమీపంలో గల టోల్‌గేట్ నుండి కార్లు, బైకులతో నాయకులు, అభిమానులు, యువకులు భారీ ర్యాలీగా బయలుదేరి జగ్గయ్యపేట చేరుకున్నారు. జగ్గయ్యపేట నుండి చిల్లకల్లు వెళ్లే రోడ్డును రూ.14 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించే పనులకు ఎంఎల్‌ఎలు, రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో కలిసి మంత్రి గోవర్ధన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.35 లక్షలతో మరమ్మతులు పూర్తి చేసిన సిమ్మింగ్ పూల్‌ను ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్‌గా ముత్తినేని విజయ శేఖర్‌తోపాటు పాలకమండలి సభ్యులతో జిల్లా జెడి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కరువు, చంద్రబాబు ఇద్దరూ కవలలన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి వర్షాలు కురుస్తూ ప్రాజెక్టులు కలకలాడుతున్నాయన్నారు. వ్యవసాయం దండగని చంద్రబాబు అన్నారని, కానీ జగన్ వ్యవసాయం పండుగ అంటూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రైతు భరోసా ఇస్తూ మిర్చి పంటకు సైతం నష్టపరిహారాన్ని అందిస్తూ రైతుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ఉదయభానుతో కలిసి ప్రభుత్వ సహకారంతో మార్కెట్ యార్డును అభివద్ధి చేస్తానని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గం అభివద్ధి పథంలో పయనిస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో రాష్ట్రం పురోగమిస్తోందన్నారు. ఏరాష్ట్రంలో అమలు చేయని పథకాలను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మిర్చి పంటకు నష్టపరిహారం జిల్లాలో ఏ నియోజకవర్గానికి రానన్ని నిధులు జగ్గయ్యపేట నియోజకవర్గానికి వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ, తిరువూరు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, వెలంపల్లి శ్రీనివాసరావు, కెడిసిసిబి చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, వేల్పుల రవికుమార్, ఎంపిపి గాంధీ తదితరులు పాల్గొన్నారు.










