ప్రజాశక్తి-రేపల్లె: వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. పట్టణంలోని 13వ వార్డులో జరిగిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిఎం జగన్మోహన్‌రెడ్డి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణారావు ఇంటింటికీ ప్రజల వద్దకు వెళ్లి వైసిపి అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సర కాలంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా వివరించి అందించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దే అన్నారు. పేద ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకోవడం ప్రతిపక్ష పార్టీలకు నచ్చడం లేదని, దీంతో ప్రభుత్వంపై లేనిపోని అపనిందలు వేస్తూ ప్రతిపక్షాలు ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన సాగుతోందని, రాబోయే రోజుల్లో కూడా జగన్‌కు ప్రజల ఆశీర్వాదాలు కావాలని కోరారు. జగనన్న గృహ సారథులు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ కన్వీనర్లు స్థానికంగా ఉన్న నాయకులతో కలిసి పనిచేస్తే 2024లో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అవటం ఖాయమన్నారు. ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాల వివరాలతో దాదాపు ప్రతి ఇంటినీ సందర్శించామని, తమ ప్రభుత్వం ప్రజలు తెలిపిన సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి త్వరితగతిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ కట్టా మంగా సుబ్బారావు, మోపిదేవి రాజీవ్ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.










