Oct 04,2023 01:11

ప్రజాశక్తి - రేపల్లె
వైసీపీ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్ అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీపై రోజురోజుకు ప్రజా వ్యతిరేఖత పెరుగుతుందని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకున్నా కక్షపూరితంగా జగన్‌ ప్రభుత్వం ఇరికించిందన్నారు.  జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లిన విషయం టిడిపికి సంబంధం లేదని అన్నారు, వైఎస్ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పుడు 2004-2009మధ్యలో చేసిన అవకతవకలు లక్షల కోట్లలో ఉండటం అప్పటి సీబీఐ  రూ.45వేల కోట్లను గుర్తించిందని అన్నారు. అందులో రూ.5వేల కోట్లను సీజ్ చేయడం రాష్ట్ర ప్రజలకు గుర్తుందని అన్నారు. స్కిల్‌ డెవలప్మెంట్‌లో ఎటువంటి అక్రమాలు జరుగలేదని ఆ సంస్థ సీఈవో స్వయంగా వెల్లడించినా సీఐడీ అక్రమంగా చంద్రబాబుకు రిమాండ్‌ విధించడం సరికాదన్నారు. తప్పు చేయకపోయినా 25రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లి వచ్చాడు కాబట్టి ప్రతిపక్ష నేతలను కూడా జైల్లో పెట్టి చూడాలని అనుకుంటున్నాడని అన్నారు. వైసిపి అరాచకాలను ప్రశ్నించే వారిని కేసుల్లో ఇరికించడం సైకో సీఎంకు అలవాటుగా మారిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం నూతన రాజధాని నిర్మాణం తోపాటు యువతకు బంగారు భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ తీసుకువచ్చినట్లు తెలిపారు. సుమారు రూ.2.13లక్షల మంది శిక్షణ పొందగా 72వేల మంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. బండారు సత్యనారాయణ అరెస్టు బాధాకరమని అన్నారు. అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. చెరుకూరు మండలంలో అమర్నాథ్ హత్య విషయంలో వైసిపి నాయకులు కుల రాజకీయాల ప్రస్తావన చేయటం సిగ్గుచేటు అన్నారు. హత్య జరిగిన వెంటనే ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రూరల్ సీఐ శివశంకర్ ప్రయత్నించటంతో ఆరోజు కుల సంఘాలన్నీ ఏకమై అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అమర్నాథ్ హత్యను కులానికి ఆపాదించడం దుర్మార్గమన్నారు. వినాయక చవితి ఉత్సవాలలో అమర్నాథ్ హత్య కేసులో నిందితుడు వెంకటరెడ్డి పాల్గొన్నాడని ఈనాడులో కథనం వస్తే అది తనకు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. వ్యవస్థలను, పోలీసులను తన గుప్పిట్లో పెట్టుకుని విచక్షణ కోల్పోయి వైసిపి నాయకుడు మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. నిందితుడు వెంకటరెడ్డి వినాయక ఉత్సవాల్లో ఎప్పుడు పాల్గొన్నాడనే విషయం నిర్ధారించటం ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ధారించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. తమవద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా రాజ్యసభ సభ్యులు మాట్లాడటం హేయమన్నారు. వినాయక నిమజ్జనంలో ప్రభుత్వ వైఫల్యంతో ఇద్దరు యువకులు మరణించారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నిమజ్జనం ఏర్పాట్లు  సక్రమంగా చేశామన్నారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలను అప్రమత్తం చేశామన్నారు. ఇవి ఏమీ లేకుండా ప్రభుత్వ వైఫల్యంతో ఇద్దరు యువకులు మరణిస్తే కమిషన్ తీసుకొని కేసును మూసేసే పరిస్థితి తీసుకువచ్చింది మీరుకాదా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.