ప్రజాశక్తి -యంత్రాంగం
ఎంవిపి.కాలనీ : తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర మంత్రి విశ్వరూప్ అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా ఎంవిపి.కాలనీలోని ఎఎస్.రాజా కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్, చంద్రబాబు పాలనకు ఎంతో తేడా ఉందని అన్నారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ సిఎం జగన్ అని కొనియాడారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరిట చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. నెల్లూరు శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ జనసేన అధినేతవి పచ్చి అబద్ధాలని అన్నారు.
అసహనంతో జనం వెనక్కి..
కార్యకర్తలకు, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావాల్సిన సభ నాలుగు దాటిన తర్వాత ప్రారంభమైంది. సభాస్థలిలో వేచి ఉన్న కార్యకర్తలు ఎండ వేడిమి తాళలేక, కనీసం తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడ్డారు. చాలా మంది అసహనంతో వెనుదిరిగారు. 20 వేల మంది హాజరవుతారని అంచనా వేసి కుర్చీలు వేయగా 80 శాతం కుర్చీలు ఖాళీగానే దర్శనమిచ్చాయి.
ఆరిలోవలో బస్సు యాత్ర ప్రారంభం
ఆరిలోవ : రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలతో పాటు మైనార్టీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పెద్ద పీట వేశారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్ర రెండో విడతను శనివారం 13వ వార్డు ఆరిలోవ కాలనీ చివరి బస్టాపు వద్ద గల వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు. దీనికి ముందుగా ఆరిలోవ కాలనీ క్రిష్టియన్ మైనార్టీ ఫంక్షన్ హాల్లో వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్‌నాథ్ మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో కీలకమైన పదవులను బిసిలకు కట్టబెట్టారన్నారు. సిఎం జగన్ పాలనలో చేసిన మంచిని సామాజిక సాధికార యాత్ర ద్వారా వివరిస్తామన్నారు.
బస్సు యాత్రకు సంఘీభావ ర్యాలీ
ఆరిలోవ కాలనీ చివరి బస్టాపు వద్ద ప్రారంభమైన సామాజిక సాధికార బస్సు యాత్రకు సంఘీభావంగా 10, 11, 12, 13 వార్డుల నుంచి వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీ బైకు ర్యాలీగా బయలు దేరారు. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి సిదిరి అప్పలరాజు, ఎంపీ ఎంవివి.సత్యనారాయణ, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, కోలా గురువులు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి డిప్యూటీ మేయర్ సతీష్, కెకె.రాజు, కార్పొరేటర్ కెల్ల సునీత, కృపారాణి తదితరులు పాల్గొన్నారు.