Nov 13,2023 23:50

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి ప్రగతి పనులను కూడా ప్రణాళికాబద్ధంగా చేపట్టి పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మేరుగు నాగార్జున చెప్పారు. నగరపాలకసంస్థ పరిధిలోని 39వ డివిజన్‌, ఉద్యోగనగర్‌లో నూతనంగా నిర్మించిన సీసీ మెయిన్‌ రోడ్డు, సైడ్‌ డ్రైన్లను మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ విప్‌ లేళ్ళ అప్పిరెడ్డి, స్ధానిక ఎమ్మెల్యే మద్దాళి గిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఆర్ధిక ఇబ్బందులు వెంటాడినా కరోనా మహమ్మారి కలవరపరిచినా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మొదటి నుంచి కూడా అభివద్ధి కార్యక్రమాల అమలులో ఎక్కడా రాజీ పడలేదని అన్నారు. ప్రజలకు సంక్షేమం ఎంత అవసరమో, రాష్ట్రానికి అభివృద్ధి సైతం అంతే అవసరమని విశ్వసించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్‌ అని కొనియాడారు. సమతూకంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ఒక మహా యజ్ఞంలా అభివృద్ధి చేస్తున్నట్ల చెప్పారు. లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో గుంటూరును రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. దశలవారీగా అభివృద్ధి చేసి గుంటూరు దశదిశ మార్చడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగనగర్‌ మెయిన్‌ రోడ్డుకు మహర్దశ పట్టిందన్నారు. ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ గుంటూరు నగరాభివృద్ధిపై గత ప్రభుత్వం పూర్తిగా అశ్రద్ధ చేసిందని, వైసిపి అధికారంలోకి వచ్చే నాటికి గుంటూరు నగరం పూర్తి అధ్వానంగా ఉందని అన్నారు. ఒక్క రోడ్డు కూడా సరిగా లేని స్థితి నుండి దశల వారీగా గుంటూరును ప్రగతి బాట పట్టించిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ షేక్‌ జుమ్మాబీ మార్కెట్‌ బాబు, బి.రవీంద్రనాథ్‌, ఎన్‌.ఉమామహేశ్వరరెడ్డి, షఫి, మున్నా, ఎవిఎల్‌ మధు, పి.మోహనరావు పాల్గొన్నారు.