Apr 05,2023 00:04
వైఎస్‌ఆర్‌ ఆసరా సంబరాల్లో పాల్గొన్న మోపిదేవి, మహిళలు

ప్రజాశక్తి-రేపల్లె: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు. రేపల్లె పట్టణంలో గల రామకోటి నగర్‌లో రాము మందిర కళ్యాణ మండపం ఆవరణలో వైఎస్సార్‌ ఆసరా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వం డ్వాక్రా గ్రూపు సభ్యులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పడంతో మహిళలందరూ రుణాలు చెల్లించకపోవడంతో చాలా గ్రూపులు మూతపడ్డాయని అన్నారు. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తన పాదయాత్రలో డ్వాక్రా గ్రూపు మహిళలకు అధికారంలోకి వచ్చిన తరువాత విడతల వారీగా రుణమాఫీ సాయం చెల్లిస్తున్నట్లు జరుగుతుందని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అధికారం చేపట్టిన తర్వాత మూడో విడత నగదును డ్వాక్రా గ్రూపుల సభ్యుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివక్షకు తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందించనున్నట్లు తెలిపారు. మహిళలకు అమ్మఒడి, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత పథకాలతో లబ్ధి చేకూరిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతి అని పేర్కొన్నారు. అనంతరం డ్వాక్రా అక్కచెల్లమ్మలు జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బుడా చైర్మన్‌ దేవినేని మల్లికార్జునరావు, మున్సిపల్‌ చైర్మన్‌ కట్టా మంగ, వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌ కుమార్‌, విశ్వనాథ గుప్తా, వైసిపి పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి, రూరల్‌ కన్వీనర్‌ గాదె వెంకయ్య బాబు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు.