Sep 07,2023 00:03

మంత్రి అమర్‌నాథ్‌కు వినతిపత్రం ఇస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నేత తరుణ్‌

ప్రజాశక్తి- అనకాపల్లి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చెప్పారు. స్థానిక అంజయ్య కాలనీలో బుధవారం పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేశారు. వైజాగ్‌ నుంచి సుంకరమెట్ట జంక్షన్‌ వరకు 342.60 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, సుంకరమెట్ట జంక్షన్‌ నుంచి శారదా బ్రిడ్జి వరకు 361 లక్షల రూపాయలతో నిర్మించనున్న తారు రోడ్డు, సెంట్రల్‌ మెరీడియన్‌, ఫుట్‌ పాత్‌ నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ సత్యవతి, ఏపీఐడబ్ల్యూఏ చైర్మన్‌ దంతులూరి దిలీప్‌ కుమార్‌, నూకాంబిక ఆలయ చైర్మన్‌ కొణతాల మురళీకృష్ణ, పలక రవి, సకల గోవిందు, ఎంపీపీ గొర్లి సూరిబాబు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
అనకాపల్లి : అనకాపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు గొర్లి తరుణ్‌ బుధవారం గాంధీనగరం అంజయ్య కాలనీలో పర్యటించిన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనకాపల్లిలో డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కళాశాల మంజూరు చేసి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు.