Sep 08,2023 20:29

మంత్రి కొట్టు సత్యనారాయణ
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
గత నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ద్వారా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు లక్షల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూరుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి కొట్టును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అన్నింటికీ అతీతంగా అర్హతే ప్రామాణికంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు కూడా ఆర్థిక లబ్ధి పొందుతున్నాయన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా, మన రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ద్వారా భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు ఏమైనా సమస్యలుంటే వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని డిప్యూటీ సిఎం కొట్టు హామీ ఇచ్చారు. అలాగే వెల్ఫేర్‌ బోర్డు, ఫండ్‌కు సంబంధించి కూడా అత్యున్నత న్యాయస్థానం తీర్పును ప్రభుత్వం శిరసావహిస్తోందన్నారు. పెండింగ్‌ క్లైమ్‌ల పరిష్కారానికి తక్షణం కార్మిక శాఖా మంత్రితో మాట్లాడతానని కొట్టు హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ 1996లో కేంద్రం సంక్షేమ బోర్డు చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. 2009లో రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఒక శాతం సెస్‌ వసూలు చేసి వెల్ఫేర్‌ బోర్డుకు జమచేస్తామని తెలిపారు. ఈ మొత్తాన్ని భవన నిర్మాణ కార్మిక కుటుంబాల సంక్షేమ పథకాల నిమిత్తం మాత్రమే వాడాలని చట్టంలో ఉందన్నారు. తక్షణం వెల్ఫేర్‌ బోర్డును పునరుద్ధరించాలని, దాని ద్వారా మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ క్లెయిములు తక్షణం పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు చిర్ల పుల్లారెడ్డి, సిరపరపు రంగారావు, దూలం ప్రసాద్‌, మండా సూరిబాబు, బాతు నాగేశ్వరరావు, తూము శ్రీనివాస్‌ పాల్గొన్నారు.