ప్రజాశక్తి-కాకినాడ బడుగు బలహీన, అట్టడుగు వర్గాల ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. గురువారం రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు బటన్ నొక్కి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి చేదోడు కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికా శుక్లా, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులు లబ్ధిదారులకు మెగా చెక్కు అందజేశారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం లబ్ధిదారుల దైనందిన జీవన గమనంలో బాగా ఉపయోగపడుతుందన్నారు.
జగనన్న చేదోడు పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు మూడు విడతల్లో సుమారుగా 12,434 మంది లబ్ధిదారులకు రూ.37.29 కోట్ల మేర ఆర్థిక సహాయం పొందినట్లు ఎంపీ వివరించారు. చేదోడు పథకం ద్వారా అందిన లబ్ధిని సద్వినియోగం చేసుకుని వృత్తిపరమైన పరికరాలు, ఇతర డ్రైక్లీనర్స్ కొనుగోలు చేసుకునేందుకు వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకం కింద మూడో విడతలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకినాడ జిల్లాలో 12,534 మంది దర్జీలు, నాయీబ్రాహ్మణులు, రజకులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.12.53 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాల్లో జమచేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ బిసి కార్పొరేషన్ ఇడి కెఎన్‌వి.ప్రసాద్ రావు, డిఎల్‌డిఒ పి.నారాయణమూర్తి పాల్గొన్నారు.










