ప్రజాశక్తి-విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని ముఖ్యంగా షెడ్యూల్ కులాలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం పట్ల జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు డా. అంజుబాల అభినందించారు. జిల్లాలో షెడ్యూల్ కులాలకు అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును గురువారం జిల్లా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు డా. అంజుబాల, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భగా ఎస్సీ కమీషన్ సభ్యులు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం షెడ్యూల కులాల జాతీయ కమీషన్ ఏర్పాటు చేయడం జరిగిందని కమీషన్ ఆయా వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతూ ఉంటుందన్నారు. షెడ్యూల్ కులాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షిస్తూ విద్యా, వైద్య, ఆర్థిక, సామాజిక ప్రయోజనాల లబ్దిని ఆయా వర్గాలు పూర్తి స్థాయిలో అందేవిధంగా కమీషన్ పర్యవేక్షిస్తుందని జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు డా. అంజుబాల అన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం అత్యత్భుతం అని ఈ విధానాన్ని ఆలోచన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కమీషన్ సభ్యులు అంజు బాల ప్రత్యేక అభినందించారు. విద్య పరంగా షెడ్యూల్ కులాలకు అందిస్తున్న సేవలను కమీషన్ సభ్యులు సమీక్షిస్తూ షెడ్యూల్ కులాలకు చెందిన వర్గాలకు విద్య రంగంలో అందిస్తున్న పథకాల లబ్ది చేకూర్చాలన్నారు. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్య దీవెన పథకాల ద్వారా షెడ్యూల్ కులాలకు ఆర్థిక చేయూతను అందించి ఉన్నత స్థాయి లో ఉండేలా ప్రత్యేకంగా పథకాలను రూపొందిచడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ముద్ర యోజన, స్టాండప్ ఇండియా రుణాలను షెడ్యూల్ కులాలకు చెందిన వర్గాలకు మంజూరు చేసిన బుుణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ... జిల్లాలో 22 లక్షల 18 వేల మంది జనాభా ఉన్నారని, వీరిలో 4 లక్షలకు పైగా షెడ్యూల్ కులాలకు చెందిన జనాభా ఉన్నారని , జనాభా పరంగా వీరి శాతం21.47 గా ఉన్నారన్నారు. సాంఘిక సంక్షేమ సవతి గృహాల్లో 933 మంది విద్యార్ధులకు వసతి కల్పించామన్నారు. భూమి లేని షెడ్యూల్‌కులాలకు చెందిన 6, 724 మంది లబ్దిదారులకు భూములను మంజూరు చేయడం జరిగిందన్నారు. పేదలందరికీ ఇళ్లు లో భాగంగా 42,814 మంది లబ్దిదారులకు జగనన్న కాలనీల్లో ఇళ్ల పట్టాలను మంజూరు చేశామన్నారు. ఈ సమావేశంలో నగర పోలీసు కమిషనర్ కాంతిరాణాటాటా, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్‌కుమార్ బాబు, జాయింట్‌కలెక్టర్ డాక్టర్ పి సంపత్‌కుమార్, సబ్ కలెక్టర్ అదితిసింగ్, డిఆర్‌ఒ కె మోహన్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










