
ప్రజాశక్తి - కొల్లూరు
స్థానిక సచివాలయంలో సంక్షేమ పథకాలపై స్పెషల్ ఆఫీసర్ రమణ అధ్యక్షతన సమీక్ష గురువారం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్మోహన్‌రెడ్డి అవసరాన్ని తెలియజేస్తూ నాలుగేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించాలని కోరారు. గ్రామంలోని మూడు సచివాలయాల పరిదిలో ఇప్పటివరకు రూ.100 కోట్లను వివిధ పథకాల ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏ సంక్షేమ పథకాలైన అమలు చేశారా అని ప్రశ్నించారు. ఎవరి ఖాతాల్లో జమ చేయకుండా గత టిడిపి ప్రభుత్వం చేసిన అప్పుల డబ్బు ఏమైందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వదిలేసిన వర్గాలను గుర్తించి పార్టీలకు అతీతంగా పథకాలు అందించినట్లు తెలిపారు. ఈనెల 15న లంక గ్రామాల్లో అనేక కాలంగా పెండింగ్లో ఉన్న లంక భూముల పట్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదగా అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో ఎంతోమంది తమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసినప్పటికీ లంక భూముల పట్టాల విషయంలో ఏమీ చేయలేకపోయారని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిభిరాలను విజయవంతం చేసిన వివిధ శాఖల అధికారులకు మంత్రి చేతుల బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు రామకృష్ణ, ఎంపీడీఒ ఐ సత్యనారాయణ, ఈఒపీఆర్డి రవిబాబు, మండల వైస్ ప్రెసిడెంట్ మురాల రాంబాబు, పంచాయితీ కార్యదర్శి మల్లికార్జునరావు, వేమూరు ఎఎంసి చైర్మన్ ఉప్పు శిరీష, వైసిపి నాయకులు ఉప్పు శ్రీనివాసరావు పాల్గొన్నారు.