Nov 14,2023 22:21

కింతలిలో సచివాలయాన్ని ప్రారంభిస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం

* శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - పొందూరు: 
నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో సాగుతున్న సంక్షేమ పాలన కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి మద్దతుగా నిలవాలని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కోరారు. మండలంలోని రాపాకలో 'వై ఎపి నీడ్స్‌ జగన్‌', కింతలిలో రూ.40 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. జగన్‌తోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్‌ ఉంటుందన్నారు. ప్రజల ముంగిటకు అన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జగన్‌దేనని కొనియాడారు. చిలకపాలెం వద్ద గల ఎన్‌ఎసిఎల్‌ పరిశ్రమ వల్ల పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో నీరు కలుషితమవుతోందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నాగావళి నది నుంచి మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ రాపాకలో పలువురు మహిళలు స్పీకర్‌ దృష్టికి తీసుకొచ్చారు. సంక్రాంతి నాటికి ఇంటింటికీ మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేసి, మంచినీరు సరఫరా చేస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి ఇప్పటివరకూ కలిగిన లబ్ధిని సూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు, సర్పంచ్‌ ప్రతినిధి కొంచాడ గిరిబాబు, వైసిపి మండల, పట్టణ అధ్యక్షులు పప్పల రమేష్‌కుమార్‌, జి.నాగరాజు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, ఎఎంసి చైర్మన్‌ బాడాన సునీల్‌కుమార్‌, వైస్‌ ఎంపిపి ప్రతినిధులు వండాన వెంకటరావు, వండాన సూరపనాయుడు, కింతలి సర్పంచ్‌, ఎంపిటిసి పైడి రాంప్రసాద్‌, కూటికుప్పల హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు.